Adani Ports సంచలనం: దేశంలోనే తొలి 'పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్'ఏర్పాటు!
భారతదేశపు సుదీర్ఘ సముద్ర తీరంలో ప్రమాదంలో ఉన్న ఓడలకు ఇక రక్షణ లభించనుంది. అత్యవసర సమయాల్లో ఓడలను సురక్షితంగా ఉంచేందుకు 'అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్' (APSEZ) దేశంలోనే మొట్టమొదటి 'పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అసలేమిటీ 'పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్'?
సముద్ర ప్రయాణంలో ఓడలు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో వాటిని సురక్షితంగా నిలపడానికి ఒక ఆశ్రయం అవసరం. అలాంటి చోట ఓడలోని సిబ్బందిని కాపాడటంతో పాటు, సరుకు పాడవకుండా చూడటం మరియు సముద్ర పర్యావరణానికి ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉన్న ఈ వ్యవస్థను, ఇప్పుడు అదానీ గ్రూప్ భారత్‌లో ప్రవేశపెట్టింది.

రెండు తీరాల్లోనూ రక్షణ కవచం
దేశంలోని రెండు ప్రధాన సముద్ర మార్గాలను కవర్ చేస్తూ అదానీ పోర్ట్స్ రెండు వ్యూహాత్మక ప్రాంతాలను ఎంచుకుంది:
- దిఘి పోర్ట్ (పశ్చిమ తీరం): అరేబియా సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్లే ఓడలకు ఇది రక్షణగా ఉంటుంది.
- గోపాల్‌పూర్ పోర్ట్ (తూర్పు తీరం): బంగాళాఖాతం మరియు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మలక్కా జలసంధి మార్గంలో ప్రయాణించే ఓడలకు ఇది అండగా నిలుస్తుంది.
అంతర్జాతీయ స్థాయి సేవలు
ఈ పోర్టులలో కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా, అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయి:
- ప్రమాదంలో ఉన్న ఓడలను బయటపడవేయడం (Salvage).
- అగ్నిప్రమాదాల నివారణ మరియు కాలుష్య నియంత్రణ.
- శిక్షణ పొందిన నిపుణులు, అత్యవసర పరికరాలతో తక్షణ స్పందన.
- దీనికోసం అంతర్జాతీయంగా పేరుగాంచిన 'స్మిత్ సాల్వేజ్' (SMIT Salvage) మరియు మెరైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) లతో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.
నిపుణులు ఏమంటున్నారు?
"పోర్టులు కేవలం ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించడమే కాదు.. ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నిర్ణయం భారత సముద్ర భద్రతా వ్యవస్థలో ఒక పెద్ద మార్పు." అని అదానీ పోర్ట్స్ సీఈఓ అశ్విని గుప్తా అన్నారు.డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ శ్యామ్ జగన్నాథన్ మాట్లాడుతూ, ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా సముద్ర ప్రమాదాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
11,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉన్న భారత్‌కు, గ్లోబల్ షిప్పింగ్ రూట్లలో ఈ 'పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్' ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ప్రతిష్ట పెరగనుంది. అదానీ గ్రూప్ తీసుకున్న ఈ చొరవతో భారత సముద్ర ప్రయాణాలు మరింత సురక్షితం కానున్నాయి.












Click it and Unblock the Notifications