Business Idea: ఎడారి లాంటి భూముల్లోనూ కాసుల వర్షం కురిపించే 'అంజీరా'!
వ్యవసాయం అంటేనే పెట్టుబడుల భారం.. అకాల వర్షాలతో నష్టాల గండం.. మార్కెట్లో ధరల్లేక దళారుల దోపిడీ.. ఇదీ ఐదేళ్లుగా సాగు రంగంలో తెలుగు రాష్ట్రాల రైతులు ఎదుర్కొంటున్న సగటు పరిస్థితి. ఇలాంటి తరుణంలో సాంప్రదాయ పంటలైన వరి, పత్తి, మిరప జోలికి వెళ్లి అప్పులపాలు కాకుండా.. కొత్త బాట పడుతున్నారు కొందరు వినూత్న రైతులు. తక్కువ నీరు, నామమాత్రపు పెట్టుబడితో 'అంజీరా' (Fig Fruit) సాగు చేస్తూ లాభాల పంట పండిస్తున్నారు. కేవలం ఏడాది తిరగక ముందే చేతికి పైసలు తెచ్చే ఈ పంట, ఇప్పుడు సాగు రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ఏ పండ్ల తోట వేయాలన్నా ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ, అంజీరా సాగుకు అయ్యే ఖర్చు వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఎకరాకు దున్నకం, మొక్కలు, డ్రిప్ సిస్టమ్ , సేంద్రీయ ఎరువుల ఖర్చు అంతా కలిపి కేవలం రూ. 20,000 నుండి రూ. 30,000 మాత్రమే అవుతుందని క్షేత్రస్థాయి రైతులు చెబుతున్నారు. నాటిన మొదటి ఏడాది నుంచే కాపు మొదలవుతుంది. రెండో సంవత్సరం నుండి పూర్తి దిగుబడి వస్తుంది. ఖర్చులన్నీ పోను ఏడాదికి ఎకరాకు రూ. 2 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు నికర లాభం పక్కాగా మిగులుతుందని రైతులు ధీమాగా వ్యక్తంచేస్తున్నారు. ఒక్కసారి నాటితే దాదాపు 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఆదాయం వస్తూనే ఉండటం దీని ప్రత్యేకత.

మన వాతావరణానికి 'అంజీరా' దిక్సూచి
అంజీరా పంటకు ఎక్కువ ఎండ, పొడి వాతావరణం చాలా అవసరం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శీతోష్ణస్థితులు ఈ సాగుకు వంద శాతం అనుకూలం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలు (అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు), ప్రకాశం జిల్లాతో పాటు.. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ వంటి తక్కువ వర్షపాతం, ఎక్కువ ఎండలు ఉండే ప్రాంతాలు ఈ సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నీరు త్వరగా ఇంకిపోయే ఎర్ర నేలలు, ఇసుక జవుడు నేలలు ఈ పంటకు ఎంతో మేలు చేస్తాయి.
'డ్రిప్'తో నీటి సమస్యకు చెక్..
అంజీరా మొక్కకు నీటి అవసరం చాలా తక్కువ. వర్షాభావ పరిస్థితులను, కరవును కూడా ఇది తట్టుకోగలదు. బోర్లలో తక్కువ నీటి లభ్యత ఉన్న రైతులు సైతం 'డ్రిప్ ఇరిగేషన్' (బిందు సేద్యం) పద్ధతి ద్వారా ఈ పంటను చాలా ఈజీగా పండించవచ్చు. ఎకరాకు సుమారు 300 నుంచి 350 మొక్కల వరకు నాటుకోవచ్చు.
తోట వద్దే వ్యాపారం.. మండిపోతున్న ధరలు
మార్కెట్లో ప్రస్తుతం తాజా అంజీర పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో రూ. 80 నుండి రూ. 120 వరకు ధర పలుకుతుండగా, నగరాల్లోని రిటైల్ మార్కెట్లలో రూ. 150 నుండి రూ. 200 పైనే విక్రయిస్తున్నారు. పండ్ల నాణ్యత బాగుంటే వ్యాపారులే నేరుగా తోటల వద్దకు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తుండటం విశేషం.
వాల్యూ ఎడిషన్: 'డ్రై ఫ్రూట్' బిజినెస్ ఐడియా!
తాజా పండ్ల అమ్మకం ఒకెత్తయితే.. అంజీరాను ఎండబెట్టి 'డ్రై ఫ్రూట్స్' (Anjeer) రూపంలో విక్రయిస్తే లాభాలు మూడు రెట్లు పెరుగుతాయి. అంజీరా పండ్లు త్వరగా పాడవుతాయి కాబట్టి, వాటిని ప్రాసెస్ చేయడం ద్వారా రైతులు మరింత లబ్ధి పొందవచ్చు.
- సింపుల్ ప్రాసెస్: బాగా పండిన అంజీర పండ్లను సేకరించి, శుభ్రం చేసి సోలార్ డ్రైయర్ ద్వారా లేదా సహజమైన ఎండలో ఆరబెట్టాలి. ఆపై వాటిని గుండ్రటి బిళ్లల ఆకారంలో ప్రెస్ చేయాలి.
- మార్కెట్లో భారీ ధర: తాజా పండ్లతో పోలిస్తే క్వాలిటీ గల డ్రై అంజీర ధర మార్కెట్లో కిలో రూ. 600 నుండి రూ. 1000 వరకు పలుకుతోంది.
- ప్యాకేజింగ్ & మార్కెటింగ్: డ్రై చేసిన అంజీరాను ఆకర్షణీయమైన వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసి, ఒక బ్రాండ్ నేమ్‌తో లోకల్ సూపర్‌మార్కెట్లు, ఆర్గానిక్ స్టోర్స్‌కు సప్లై చేయవచ్చు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో లిస్ట్ చేసి దేశవ్యాప్తంగా అమ్ముతూ నేరుగా వ్యాపారస్తులుగా మారవచ్చు.
స్మార్ట్ సాగుతోనే ముందడుగు:
సాంప్రదాయ పంటలు వేసి చేతులు కాల్చుకునే కంటే.. మారుతున్న మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా అంజీరా లాంటి తక్కువ పెట్టుబడి, ఎక్కువ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటల వైపు అడుగులు వేయడమే నేటి రైతాంగానికి శ్రీరామరక్ష. శ్రమతో పాటు కొద్దిగా స్మార్ట్ ఆలోచన తోడైతే అంజీరా సాగుతో అన్నదాతల ఇంట లక్ష్మీదేవి తాండవించడం ఖాయం!














Click it and Unblock the Notifications