బడ్జెట్ తర్వాత మార్కెట్‌కు ఊపిరి… దేశీయ సూచీల దూకుడు
కేంద్ర బడ్జెట్‌లో పన్నుల అంశాలు మార్కెట్‌ను ఒక్కసారిగా కలవరపెట్టినా, ఇతర ఆర్థిక ప్రోత్సాహక చర్యలు మదుపర్లలో మళ్లీ నమ్మకాన్ని పెంచాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. నిన్నటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో పన్ను ప్రతిపాదనల కారణంగా భారీగా నష్టపోయిన సూచీలు, ఈ రోజు బడ్జెట్‌లోని వృద్ధి దిశగా తీసుకెళ్లే అంశాలపై దృష్టి సారించడంతో జోరు చూపించాయి.
ప్రభుత్వ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమలకు ఊతం వంటి అంశాలు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ వంటి హెవీవెయిట్ షేర్లకు వచ్చిన బలమైన కొనుగోళ్లతో సూచీలకు గట్టి మద్దతు లభించింది.

ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్, మధ్యాహ్నానికి లాభనష్టాల మధ్య ఊగిసలాడినా, చివరి గంటలో కొనుగోళ్ల ఒత్తిడి పెరగడంతో గణనీయంగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ లాభాలతో మదుపర్ల సంపద ఒక్క రోజులోనే సుమారు రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.455 లక్షల కోట్ల స్థాయికి చేరింది. నిఫ్టీ మరోసారి 25 వేల మార్కును దాటడం గమనార్హం.
సెన్సెక్స్ ఉదయం 80,555.68 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 81,732.25 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 943.52 పాయింట్ల లాభంతో 81,666.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 252.95 పాయింట్లు పెరిగి 25,088.40 వద్ద స్థిరపడింది.
కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 91.50గా కొనసాగింది. సెన్సెక్స్ 30 షేర్లలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ట్రెంట్, టైటాన్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ చమురు బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర 4,680 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తం మీద బడ్జెట్‌లోని వృద్ధి దిశా సూచనలు మార్కెట్‌ను మళ్లీ పాజిటివ్ ట్రాక్‌పై నిలిపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications