LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు! వరుసగా మూడో నెల పెంపు..
పండుగల వేళ వ్యాపారులకు , సామాన్య వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను మళ్లీ పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తక్షణమే అమలులోకి వచ్చేలా వాణిజ్య సిలిండర్‌పై రూ. 10 చొప్పున పెంచడంతో ఢిల్లీలో దీని ధర రూ. 2,820కి చేరింది. వరుసగా మూడో నెలలో కూడా ఈ కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం గమనార్హం. పండుగల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ , చిన్న తరహా వ్యాపారాలపై మరింత అదనపు భారంగా మారనుంది.
హోటల్స్, టిఫిన్ సెంటర్లపై ప్రభావం!
వరుస పండుగల సమయాల్లో గ్యాస్ ధర పెరగడం వల్ల మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు, హోటల్ తినుబండారాల రేట్లు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్ 1 నాటికి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,810 ఉండగా, ఇప్పుడు దానికి రూ. 10 తోడై రూ. 2,820 కి పెరిగింది. మరోవైపు కొత్త కనెక్షన్ కోసం వినియోగించే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధర రూ. 1,903 గా నమోదవ్వగా, దాని రీఫిల్ ధర రూ. 782 గా నిర్ధారించారు.

సమర వాతావరణం.. పతాక స్థాయికి చమురు ధరలు!
ఈ ఏడాది సముద్ర మార్గాల్లో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా చమురు , ఎల్పీజీ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ముఖ్యంగా 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' ప్రాంతంలో నావికా రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపు సగానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకల ప్రయాణ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగిపోవడం వల్ల ఈ ధరల భారాన్ని భరించాల్సి వస్తోంది.
ఉత్పత్తి కష్టాలు.. అంతర్జాతీయంగా ఊగిసలాట!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 110 డాలర్ల కంటే పైనే కొనసాగుతుండటం, సౌదీ అరామ్కో ఒప్పంద ధరలు అధికంగా ఉండటంతో దేశీయంగా సిలిండర్ల రేట్లు పెంచక తప్పడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మే 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా వెయ్యి రూపాయిల వరకు పెరిగి రూ. 3,071 నాటి గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత జులై, ఆగస్టు నెలల్లో కొంత తగ్గుముఖం పట్టి రూ. 380 వరకు ఊరట లభించినప్పటికీ, సెప్టెంబర్, అక్టోబర్ , నవంబర్ నెలల్లో వరుసగా పెరుగుతూ రావడం వ్యాపార రంగానికి పెద్ద సవాలుగా మారింది.














Click it and Unblock the Notifications
