దీపావళి నాడు తిరుమల శ్రీవారి సన్నిధిలో..: ఆర్జిత సేవలు రద్దు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 74,239 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,313 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 19 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది.
ఆ ఒక్క రోజే మొత్తం 3.89 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 1.79 లక్షలమంది భక్తులు శ్రీనివాసుడి అన్నప్రసాదాలను స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో 2,708 మంది భక్తులు తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఇతర మెడికల్ క్యాంప్ లల్లో వైద్యసహాయాన్ని పొందారు. కాగా.. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 8 తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం కార్యక్రమం జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది.. టీటీడీ.

దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థాన కార్యక్రమం ఏర్పాటవుతుంది. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్పస్వామి కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంపై గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల‌్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున.. దీనికి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
దీపావళి ఆస్థానం కారణంగా ఆ రోజున నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ కూడా రద్దయినట్లు టీటీడీ తెలిపింది. తోమాల, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆస్థానం రోజున ఆర్జిత సేవలు రద్దయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.














Click it and Unblock the Notifications
