మళ్లీ తుఫాను.. ప్రచండ వేగంతో నేడు తీవ్ర వాయుగుండంగా మారి కుంభవృష్ఠి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాను భయాలు మళ్లీ వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న వచ్చిన అర్నాబ్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే.. సముద్రంలో మరో ఉగ్ర తుఫాను ఊపిరి పోసుకుంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాకాసి వేగంతో విరుచుకుపడేందుకు సిద్ధమవుతుండటంతో కోస్తాంధ్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించగా, అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఆదివారం ఉదయానికి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నానికి ఇది తీవ్ర వాయుగుండంగా, అర్ధరాత్రి నాటికి తుఫానుగా మారనుండగా.. రేపటికి తీవ్ర తుఫానుగా రూపంతరం చెందనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆ రోజు ఉదయమే తీరం దాటే ప్రమాదం
నవంబర్ 3వ తేదీ తెల్లవారుజాముకే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి అతి సమీపంలోకి రానున్న ఈ తీవ్ర తుఫాను, అదే రోజు ఉదయం నెల్లూరు-నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, గాలి వేగం గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు చేరే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో కోస్తా ప్రాంతాలు విపత్తు ముప్పులో కూరుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
మూడు రోజుల పాటు జల దిగ్బంధం?
ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సోమవారం నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగి ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావచ్చని సమాచారం. రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరుల్లోనూ వానలు ముంచెత్తనున్నాయి.
విశాఖ నుంచి తిరుపతి దాకా బిక్కుబిక్కు
మంగళవారం నాటికి తుఫాను ఉగ్రరూపం దాల్చనుండటంతో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరంతో పాటు కర్నూలు, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందంటున్నారు. సముద్రం తీవ్ర అలజడిగా మారనుండటంతో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే వెనక్కి రావాలని ఆదేశించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వీలుగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అత్యవసర శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.














Click it and Unblock the Notifications
