నవంబర్ 1 నుంచి మారే రూల్స్ ఇవే.. పింఛనుదారులకు అలర్ట్
అక్టోబర్ నెల ముగిసి నవంబర్ నెలలోకి అడుగుపెడుతున్న తరుణంలో సామాన్యుల నుంచి పన్ను చెల్లింపుదారులు, పింఛనుదారుల వరకు పలు కీలక ఆర్థిక నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయి. జీఎస్టీ సడలింపులు, ఎల్పీజీ సిలిండర్ ధరల సమీక్ష, పింఛనుదారుల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ, ఐటీఆర్ గడువు పెంపు వంటి అంశాలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతినెలా మొదటి తేదీన మారే ఈ రూల్స్ ప్రజల దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్న నేపథ్యంలో వాటి వివరాలను ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం.
వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. జీఎస్టీ నిబంధనల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చేలా జీఎస్టీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. సేల్స్ ముగిసిన తర్వాత ఇచ్చే రాయితీలు (పోస్ట్-సేల్ డిస్కౌంట్లు) ప్రొవిజనల్ రీఫండ్లకు సంబంధించిన ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ నవంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఇన్వర్టెడ్ డ్యూటీ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న వర్తకులకు, వ్యాపార సంస్థలకు క్యాష్ ఫ్లో పెరిగి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.

ఎల్పీజీ గ్యాస్ ధరల సమీక్ష.. వాణిజ్య సిలిండర్లపై ప్రభావం?
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా మొదటి తేదీన ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. నవంబర్ 1న కూడా గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది. ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగినా లేదా తగ్గినా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా వ్యాపారాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ధరల మార్పుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకునే ముందు తాజా ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పింఛనుదారులకు అలర్ట్.. లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ ప్రారంభం!
ప్రభుత్వ పింఛనుదారులు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందడానికి ఏటా 'లైఫ్ సర్టిఫికెట్' (హయాతి ప్రమాణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. 80 ఏళ్లలోపు ఉన్న పింఛనుదారులు నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ లోపు తమ లైఫ్ సర్టిఫికెట్లను బ్యాంకుల్లో లేదా ఆన్‌లైన్ విధానంలో సమర్పించవచ్చు. గడువులోగా ఈ పత్రాలు అందజేయకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. (80 ఏళ్లు దాటిన వారికి అక్టోబర్ 1 నుంచే ఈ అవకాశం కల్పించారు).
ఐటీఆర్ దాఖలు గడువు పెంపు.. డిసేబిలిటీ పెన్షన్ సవరణలు
అకౌంట్లు ఆడిటింగ్ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ తీపి కబురు అందించింది. 2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 21 వరకు పొడిగించింది. మరోవైపు దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించి కేంద్ర కేబినెట్ పరిమితులను 80% నుంచి 40%కి తగ్గించినప్పటికీ, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు రావాల్సి ఉన్నందున ఇవి నవంబర్ 1 నుంచి తక్షణమే తక్షణమే అమలు కావడం లేదని స్పష్టమైంది.














Click it and Unblock the Notifications
