భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు! ఒకటో తారీఖే బిగ్ షాక్
దేశంలో పండుగ సీజన్ ప్రారంభమవుతున్న వేళ సామాన్యులకు, హోటల్ రంగానికి చుక్కలు కనిపించేలా ధరలు పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి ఆయిల్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర వివిధ నగరాలను బట్టి ఏకంగా రూ. 62 నుంచి రూ. 71 వరకు పెరిగింది. అయితే ఇళ్లల్లో వంట గ్యాస్‌గా ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో గృహిణులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ భారం ఇటు రెస్టారెంట్ యజమానులకు, అటు వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 62.50 పెరగడంతో, దీని కొత్త ధర రూ. 2,810కి చేరింది. గత నెలలో ఇది రూ. 2,747.50గా ఉండేది. ముంబైలో రూ. 63 పెరిగి రూ. 2,764కి చేరగా, చెన్నైలో రూ. 66.50 పెరిగి రూ. 2,983కి ఎగబాకింది.

పాట్నాలో అత్యధికంగా రూ. 71.50 పెంపు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్ల ధరల పెంపు భిన్నంగా ఉంది. బిహార్ రాజధాని పాట్నాలో అత్యధికంగా రూ. 71.50 పెరగడంతో, సిలిండర్ ధర రూ. 3,100.50కి చేరుకుంది. లక్నోలో రూ. 62.50 పెరిగి రూ. 2,932.50కి చేరింది. ఇక లే ప్రాంతంలో రూ. 3,450కి, తవాంగ్‌లో రూ. 3,073.50కి, అహ్మదాబాద్‌లో రూ. 2,831.50కి, కన్యాకుమారిలో రూ. 3,046కి కమర్షియల్ సిలిండర్ ధరలు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ ఆధారంగా ఈ ధరలను సవరించినట్లు పెట్రోలియం వర్గాలు పేర్కొంటున్నాయి.
డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
కమర్షియల్ వినియోగదారులకు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఇళ్లలో వంట గ్యాస్ వాడే సామాన్య వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఢిల్లీలో రూ. 942, ముంబైలో రూ. 941.50, చెన్నైలో రూ. 957.50, లక్నోలో రూ. 979.50 , పాట్నాలో రూ. 1,031.50 చొప్పున పాత ధరలే కొనసాగనున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లపై పడనున్న ఆర్థిక భారం
ఈ తాజా గ్యాస్ ధరల పెంపు నేరుగా హోటళ్లు, దాబాలు, కేఫ్‌లు, టీ స్టాళ్లు , క్యాటరింగ్ వ్యాపారం నిర్వహించే వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. పండుగ సమయాల్లో డిమాండ్ విపరీతంగా పెరిగే తరుణంలో, సిలిండర్ల ధరలు అకస్మాత్తుగా పెరగడం వాణిజ్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. హోటల్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో రాబోయే రోజుల్లో బయట తినే తిండి, హోటల్ ఐటమ్స్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.














Click it and Unblock the Notifications
