దేశంలోనే ఫస్ట్ టైమ్ రోబోటిక్స్‌తో ఇళ్ల నిర్మాణం.. ఏపీలో 3డీ హౌసింగ్ ప్రాజెక్ట్!
గృహ నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికవుతోంది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ (3డీసీపీ) సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ 2.0 పథకం కింద తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామంలో ప్రయోగాత్మకంగా 100 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతోంది. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీబీఆర్‌ఐ మధ్య ఈ కీలక ఒప్పందం కుదరనుంది.

325 చదరపు అడుగుల్లో ప్రత్యేక డిజైన్‌తో ఇళ్లు
ఇప్పటివరకు ఇతర దేశాల్లో లేదా ప్రైవేట్ రంగంలో మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీని.. మన దేశ వాతావరణ పరిస్థితులకు, స్థానిక అవసరాలకు తగ్గట్టుగా సీబీఆర్‌ఐ నిపుణులు మరింత మెరుగుపరిచారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సరికొత్త నిర్మాణ డిజైన్‌ను కూడా సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఇంటిని సరిగ్గా 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
పీఎంఏవై-గ్రామీణ్ 2.0 కింద సాధారణ ఇళ్లకు ఇచ్చే బడ్జెట్‌తో పోలిస్తే, ఈ 3డీ ప్రింటింగ్ ఇళ్లకు అదనపు ఆర్థిక సాయం అందించనున్నారు. సరికొత్త సాంకేతికతను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ అదనపు భారాన్ని సంయుక్తంగా భరించనున్నాయి.
రోబోటిక్ పరిజ్ఞానంతో క్షణాల్లో గోడల నిర్మాణం
పూర్తిగా రోబోటిక్ పరిజ్ఞానంతో నడిచే ఈ 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ విధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముందుగా ఆర్కిటెక్ట్‌లు కంప్యూటర్‌లోని 3డీ క్యాడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా భవనానికి సంబంధించిన కచ్చితమైన డిజైన్‌ను రూపొందిస్తారు. ఆ తర్వాత 3డీ ప్రింటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కాంక్రీట్ మిశ్రమాన్ని పంపుల ద్వారా నేరుగా ప్రింటర్‌కు అందిస్తారు.
కంప్యూటర్ ఇచ్చే కమాండ్ల ప్రకారం రోబోటిక్ హ్యాండ్ లేదా గ్యాంట్రీ ప్రింటర్ పనిచేస్తుంది. నాజిల్ ద్వారా కాంక్రీట్‌ను ఒక క్రమ పద్ధతిలో పొరలు పొరలుగా అమర్చుకుంటూ పోతుంది. వేసిన వెంటనే తొలి పొర గట్టిపడి, దానిపై వచ్చే తదుపరి లేయర్ బరువును తట్టుకునేలా ఈ ప్రత్యేక మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు.
సాధారణ పద్ధతుల కంటే ఎన్నో రెట్లు లాభాలు
ఈ అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ వల్ల కేవలం సమయమే కాకుండా నిర్మాణ రంగంలో అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే దాదాపు 50 నుంచి 70 శాతం వేగంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గోడల నిర్మాణానికి ఎలాంటి సెంట్రింగ్ సామగ్రి అవసరం ఉండదు. అంతేకాకుండా మెటీరియల్ వృథా అయ్యే శాతం ఏకంగా 30 నుంచి 60 శాతం వరకు తగ్గుతుంది. ఎలాంటి క్లిష్టమైన వంపులు, సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్ డిజైన్లనైనా సరే ఈ టెక్నాలజీ ద్వారా అత్యంత సులువుగా, తక్కువ ఖర్చుతో నిర్మించడం సాధ్యమవుతుంది.














Click it and Unblock the Notifications
