రెచ్చిపోయిన రాగి.. ఒక్కసారిగా విపరీతమైన డిమాండ్! టన్ను ఎంతంటే?
బంగారం, వెండి ధరలతో పోటీ పడుతూ గ్లోబల్ మార్కెట్‌లో రాగి (కాపర్) హవా ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించబోయే టారిఫ్‌ల భయాలు, మరోవైపు మైనింగ్ వ్యాపారంలో వస్తున్న ఊహించని అవాంతరాలు.. కాపర్ ధరలకు విపరీతంగా రెక్కలు తొడిగాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ లో బెంచ్ మార్క్ త్రీ-మంత్స్ ఫ్యూచర్స్ ధర ఎప్పుడూ లేనంతగా టన్నుకు ఏకంగా 14,533 డాలర్ల ఆల్-టైమ్ రికార్డు స్థాయిని తాకింది. ఈ ఏడాదిలోనే రాగి ధర దాదాపు 17 శాతం పెరగ్గా, గత 12 నెలల కాలంలో ఏకంగా 47 శాతం మేర ఎగబాకడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ కాపర్ అవసరం పెరిగిపోతోంది. ముఖ్యంగా డాటా సెంటర్లు, రినైవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్ల విస్తరణకు రాగి అత్యంత కీలకంగా మారింది. అయితే దానికి తగ్గట్టుగా సరఫరా మాత్రం జరగడం లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న పాత గనుల నుంచి సరిపడా ఉత్పత్తి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కాపర్ డిమాండ్-సప్లై మధ్య చాలాకాలంగా ఉన్న ఈ భారీ గ్యాప్, ధరలను నిలకడగా పైపైకి తీసుకెళ్తోంది.

అమెరికా 'పన్ను' భయంతో వ్యాపారుల ఎత్తుగడలు!
రాగికి ఈ స్థాయి రేటు రావడానికి తాత్కాలిక కారణాలు కూడా గట్టిగానే పనిచేస్తున్నాయి. రిఫైన్డ్ మెటల్ దిగుమతులపై కూడా ట్రంప్ సర్కార్ పన్నులు పెంచుతుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లాభాలు పిండుకోవాలని భావించిన గ్లోబల్ ట్రేడర్లు.. కొన్ని లక్షల టన్నుల రాగిని అమెరికాకు తరలించేశారు. దీనివల్ల ప్రపంచదేశాల్లోని నిల్వలు తగ్గిపోయి, ఒక్క అమెరికాలోనే కాపర్ కుప్పలుగా పేరుకుపోయింది. "ఇది లోహానికి ఉన్న అసలైన డిమాండ్ వల్ల పెరిగిన ధర కాదు, కేవలం టారిఫ్ భయాలతో ఒకే చోటికి సరుకు తరలించడం వల్ల వచ్చిన తాత్కాలిక షార్టేజ్" అని చిలీకి చెందిన ప్రముఖ మైనింగ్ విశ్లేషకుడు క్రిస్టియన్ సిఫ్యూ ఎంటెస్ అభిప్రాయపడ్డారు.
చిలీలో పడిపోయిన ఉత్పత్తి.. మైనింగ్ దిగ్గజాలకు పండగ!
సాధారణంగా ధరలు పెరిగితే పారిశ్రామిక రంగానికి భారం అవుతుంది కానీ, రాగి గనుల వ్యాపారం చేసే కంపెనీలకు మాత్రం ఇది పెద్ద పండగలా మారింది. రియో టింటో, బీహెచ్‌పీ, గ్లెన్‌కోర్, జీజీన్ మైనింగ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు కాపర్ బిజినెస్ ద్వారా ఊహించని రీతిలో లాభాలను మూటగట్టుకున్నాయి. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా రాగిని ఉత్పత్తి చేసే చిలీ దేశంలో ఉత్పత్తి పడిపోవడం ఇక్కడ గమనార్హం. గత ఆగస్టులో చిలీ రాగి ఎగుమతులు భారీగా క్షీణించాయి.
ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఏమైనా పుంజుకుంటే తప్ప, 2017 తర్వాత గనుల నుంచి రాగి ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి అవుతుంది. ఒకవైపు సరఫరా తగ్గి, మరోవైపు గ్లోబల్ డిమాండ్ పెరుగుతుండటంతో మున్ముందు రోజుల్లో రాగి ధరలు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications
