త్వరలో తిరుమలలో భక్తులకు అందుబాటులో.. నిర్మాణం తుదిదశలో !!
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతోంది. గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తోన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడం, వాహన సేవలను తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం.
అదే సమయంలో తిరుమలలో ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీని నిర్మాణ పనులు తుదిదశకు చేరకున్నాయి. పట్టు వస్త్రాలను సమర్పించడానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీ మ్యూజియం నిర్మాణ పనులపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. గడువులోగా తుదిదశ నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మ్యూజియంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విభాగం తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మ్యూజియం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై టీసీఎస్ టీమ్ కు కూడా అవసరమైన సమాచారం, సూచనలు అందించాలని చెప్పారు.
అనంతరం తిరుమలలో సెల్‌ఫోన్ సిగ్నల్ వ్యవస్థ, సెల్ టవర్ల పనితీరుపై వెంకయ్య చౌదరీ సమీక్ష నిర్వహించారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలతో పాటు కాలిబాటలు, ఘాట్ రోడ్లలో భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ సదుపాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. గరుడసేవ నాడు భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ఆ రోజు మొబైల్ సిగ్నల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచి, ఎలాంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం తిరుమల, ఘాట్ రోడ్లు, కాలిబాటల్లో ఎన్ని సెల్ టవర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయనే అంశాలను అధికారులు, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి సమీక్షించారు. అన్ని సెల్ టవర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా సంబంధిత సరఫరాదారులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
