వారం రోజుల పాటు సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
శాసనసభ, మండలి సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ మేరకు ఉభయ సభలను ఈనెల 12 వరకు నిర్వహించాలని బీఏసీలో ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై అవసరమైతే మరోసారి సమీక్ష జరపాలని నిర్ణయానికి వచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చకు బీఏసీ ఆమోదం తెలిపింది. అలాగే 22ఏ పై జ్యుడిషియల్ విచారణ చేయాలని ప్రతిపాదించింది. ఇవాళ ఉదయం 22ఏ నిషేధిత భూముల జాబితాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దీంతో పాటు మరో 22 కీలకమైన అంశాలపై చర్చ జరిపేందుకు కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
మరోవైపు బీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని.. అసెంబ్లీని కనీసం 20 నుంచి 30 రోజుల పాటు నడపాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ త్రీ లైన్ విప్ జారీ చేసినట్లు సమాచారం. మంగళవారం సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. పార్టీ విధానాల ప్రకారం హౌజ్ లో నడుచుకోవాలని పేర్కొంది. ఇక ఇవాళ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే స్పీకర్ పై అభ్యంతరకరమైన భాష వాడిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా తాతా మధును బర్తరఫ్ చేయడంతోపాటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం స్పీకర్ కు సభకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇక బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నిబంధనలను ఎమ్మెల్యేలు ఉల్లంఘిస్తున్నట్లు స్పీకర్ భావిస్తే సభాపతిగా ఆయన తగిన చర్యలు తీసుకొంటున్నారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసుల్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
