Davos 2026: ఆర్థిక చర్చలకు పుట్టినిల్లు దావోస్.. ఆసక్తికర విషయాలు
ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ ఒక కీలక మలుపులో నిలిచిన వేళ… ప్రపంచ భవిష్యత్తు దిశను నిర్ణయించే చర్చలకు మరోసారి వేదికగా మారుతోంది స్విట్జర్లాండ్‌లోని దావోస్. ఈ పేరు తెలియని ప్రభుత్వాధినేతగానీ, అగ్రశ్రేణి వ్యాపారవేత్తగానీ లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం – WEF) కేవలం చర్చల వేదిక మాత్రమే కాదు… రేపటి ప్రపంచ ఆర్థిక రాజకీయాలకు పునాది వేసే కేంద్రం.
సోమవారం నుంచి ఐదు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇందులో 64 మంది దేశాధినేతలు, 400 మందికిపైగా రాజకీయ నాయకులు, 1,000 మంది సీఈవోలు పాల్గొనడం విశేషం. ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం, వ్యాపారవేత్తలు అవకాశాల కోసం దావోస్ బాట పడుతున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, యుద్ధాల ప్రభావం, కృత్రిమ మేధ విప్లవం, వాతావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చ జరగనుంది.

ఆల్ప్స్ పర్వతాల మధ్య అతి శీతల వాతావరణంలో ఉన్న దావోస్‌కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 19వ శతాబ్దంలో టీబీ మహమ్మారి విస్తరించిన సమయంలో స్వచ్ఛమైన గాలి కోసం ఐరోపా దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చేవారు. అప్పట్లో నిర్మించిన ఓ ఇంగ్లిష్ కిర్క్ చర్చీ… ఈ రోజు ప్రపంచ ఆర్థిక వేదికకు కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు ఆరోగ్య పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ స్కీయింగ్ రిసార్టు పట్టణం, ఇప్పుడు ప్రపంచాన్ని నడిపించే నిర్ణయాలకు సాక్షిగా నిలుస్తోంది.
ఎవరు ప్రారంభించారు..
1971 నుంచి ప్రతి జనవరిలో దావోస్‌లో ఈ సదస్సు జరుగుతోంది. తొలుత యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరం పేరుతో ప్రారంభమైన ఈ సమావేశాన్ని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ స్వాబ్ ప్రారంభించారు. తొలి సదస్సుకు 400 మంది ఐరోపా వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ఆయన… క్రమంగా దీన్ని ప్రపంచ నేతల మేధోమథన వేదికగా మార్చారు. జెనీవా కేంద్రంగా పనిచేసే డబ్ల్యూఈఎఫ్ ఈ ఏడాది 56వ సదస్సును నిర్వహిస్తోంది.
చరిత్రలో..
దావోస్ చరిత్రలో కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాలకు వేదికైంది. 1988లో గ్రీస్, తుర్కియే మధ్య దావోస్ డిక్లరేషన్ యుద్ధాన్ని నివారించింది. 1989లో ఉత్తర, దక్షిణ కొరియాల తొలి మంత్రిత్వ సమావేశం ఇక్కడే జరిగింది. 1994లో గాజా, జెరీకో ఒప్పందంపై ఇజ్రాయెల్, పాలస్తీనాలు ఇక్కడే సంతకాలు చేశాయి. జర్మనీ పునరేకీకరణకు సంబంధించిన కీలక చర్చలను అప్పటి ఛాన్సలర్ హెల్మట్ కోల్ దావోస్‌లోనే జరిపారు. ఆ తర్వాతే బెర్లిన్ గోడ కూలిపోయింది.
ఉగ్రదాడులు, కరోనా..
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఒక్కసారే దావోస్‌ను విడిచింది. 2001లో అమెరికాపై ఉగ్రదాడుల నేపథ్యంలో 2002లో బాధితులకు సంఘీభావంగా న్యూయార్క్‌లో సదస్సు నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా 2021లో వర్చువల్‌గా, 2022లో మే నెలలో సదస్సు జరిగింది.
అయితే అంతటి ప్రాధాన్యం ఉన్న దావోస్‌లో వసతి సౌకర్యాలే అతిపెద్ద సవాలు. దావోస్‌తో పాటు సమీప ప్రాంతాలైన క్లోస్టర్స్, డార్ఫ్‌లలో కలిపి కేవలం 10 మధ్య స్థాయి, 40 చిన్న హోటళ్లు మాత్రమే ఉన్నాయి. సదస్సు జరిగే ఐదు రోజులపాటు ఈ ప్రాంతం పూర్తిగా కిక్కిరిసిపోతుంది.
టైట్ సెక్యూరిటీ..
అగ్రశ్రేణి నేతలు హాజరవుతుండటంతో భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది. దావోస్ సదస్సు భద్రత కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం రూ.101.67 కోట్లు ఖర్చు చేస్తోంది. 5,000 మంది సాయుధ బలగాలు, స్నైపర్లు, ఏఐ ఆధారిత డ్రోన్లు, సైబర్ నిఘా వ్యవస్థలతో దావోస్‌ను పూర్తిగా కవచం చేస్తున్నారు.
ప్రపంచాధినేతలు...
ఈ ఏడాది సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్క్, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్, చైనా ఉప ప్రధాని హీ లీఫెంగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తదితరులు హాజరవుతున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో, నాటో, డబ్ల్యూహెచ్‌వో వంటి అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా పాల్గొంటున్నారు.
భారత్ నుంచి..
భారత్ నుంచి కూడా భారీగానే ప్రతినిధులు దావోస్‌కు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కె. రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడణవీస్, హిమంత బిశ్వ శర్మ, హేమంత్ సోరెన్ తదితరులు హాజరవుతున్నారు. 100 మందికిపైగా అగ్రశ్రేణి భారతీయ సీఈవోలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
ముకేశ్ అంబానీ నుంచి నందన్ నీలేకని వరకు, సునీల్ భారతీ మిత్తల్ నుంచి నిఖిల్ కామత్ వరకు… భారత వ్యాపార దిగ్గజాలు దావోస్‌లో పెట్టుబడులు, గ్లోబల్ భాగస్వామ్యాలపై కీలక చర్చలు జరపనున్నారు.
మొత్తంగా చూస్తే, దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కేవలం సమావేశం కాదు… అది ప్రపంచ భవిష్యత్తును మలిచే నిర్ణయాలకు జన్మస్థలం. ఇక్కడ జరిగే ప్రతి చర్చ, ప్రతి ఒప్పందం రేపటి ప్రపంచాన్ని ప్రభావితం చేయనుంది. అందుకే… ప్రపంచం మరోసారి దావోస్ వైపే చూస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications