ట్విట్టర్‌లో జీఎస్టీ సందేహాలకు పరిష్కారం: టెక్కీ సావీ అధికారులతో ఆర్థికశాఖ టీం రెడీ

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జీఎస్టీపై సందేహాలు, వ్యాపారుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిచ్చేందుకు కేంద్రం సోషల్ మీడియా 'ట్విట్టర్'తోపాటు ఇంటర్నెట్‌ను వేదికగా చేసుకోనున్నది. ట్వీట్ల రూపంలోనూ, ఈ- మెయిల్స్ వ్యాపారులు పంపే ప్రశ్నలకు ఆర్థికశాఖ సమాధానం ఇచ్చేందుకు పన్నుల విభాగానికి చెందిన ఎనిమిది మంది అధికారులను నియమించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులో వెల్లడించింది. ఈ అధికారులంతా అసిస్టెంట్ కమిషనర్లేనని, తమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇరుగు పొరుగు కమిషనరేట్ల నుంచి ఈ అధికారులను ఎంపిక చేశామని ఆర్థిక శాఖ తెలిపింది.
గత ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా టెక్నాలజీ పరంగా అన్ని రకాల మెళకువలు తెలిసిన అధికారులు కూడా. నియమితులైన వారి పేర్లు ఇలా ఉన్నాయి. రాజ్ కరణ్ అగర్వాల్, రజనీ శర్మ, రానాఖ్ జమీల్ అన్సారీ, శాంతాను, బుల్లో మమూ, హీరాలాల్, మనీష్ చౌదరి, అంషికా అగర్వాల్. వీరంతా రకరకరాలుగా వచ్చే ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా పరిష్కార మార్గాలు చూపుతారని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

నెలాఖరులోగా వ్యాపారుల ఆందోళనపై జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక

నెలాఖరులోగా వ్యాపారుల ఆందోళనపై జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిటర్నుల దాఖలు ప్రక్రియను సరళతరం చేసేందుకు జీఎస్‌టీఎన్ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో సమావేశం కానున్నది. తద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుని.. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నేతృత్వంలోని మంత్రుల గ్రూపు (జీఓఎం)నకు నివేదిక సమర్పిస్తుంది. మంత్రుల గ్రూపు ఈ నెలాఖరు నాటికి తన సిఫారసులను ఖరారు చేసి జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిస్తుందని భావిస్తున్నట్లు పాండే తెలిపారు. జీఎస్టీ రిటర్నుల దాఖలు ప్రక్రియను సరళతరం చేసి వ్యాపారులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ఈ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇనిషియల్ సేల్స్ రిటర్న్ జీఎస్‌టీఆర్-3బీతో పాటు నెలకు మూడు రిటర్నులను దాఖలు చేయడం వ్యాపారులకు పెను భారంగా పరిణమించడంతో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

గడువు లోపు రిటర్న్‌లు సమర్పించకుంటే కఠిన చర్యలు తప్పవని ఐటీ హెచ్చరిక

గడువు లోపు రిటర్న్‌లు సమర్పించకుంటే కఠిన చర్యలు తప్పవని ఐటీ హెచ్చరిక

పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా నగదు డిపాజిట్లు చేసిన వ్యక్తులు, సంస్థలు వచ్చే మార్చి 31వ తేదీలోగా తమ రిటర్న్‌లు దాఖలు చేయాలని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వును పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే శిక్షకు అర్హులవుతారని హెచ్చరించింది. అర్హత పొందిన ట్రస్టులు, రాజకీయ పార్టీలు, సంఘాలు కూడా వచ్చే నెల 31వ తేదీలోగా ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి మచ్చ లేకుండా బయటపడాలని సూచించింది. ఈ మేరకు ఐటీ విభాగం ప్రముఖ దినపత్రికల్లో బహిరంగ ప్రకటనలు జారీ చేసింది. 2016-17, 2017-18 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఆలస్యమైన.. సవరించిన ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు ఇదే చివరి సూచన అని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఈ కేటగిరీల్లోని పన్ను చెల్లింపుదారులకు ఇంకా చాలా సమయం ఉన్నదని, కనుక వారంతా గడువు తేదీకి ముందే రిటర్న్‌లు దాఖలు చేసి చివరి నిమిషంలో రద్దీ లేకుండా చూసుకోవాలని ఐటీ విభాగం సూచించింది.

మూడేళ్లలో ఐదు రెట్లు పెరిగిన బ్యాంకుల మొండి బకాయిలు

మూడేళ్లలో ఐదు రెట్లు పెరిగిన బ్యాంకుల మొండి బకాయిలు

మొండి బకాయిలను రద్దు చేయడంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐదే మొదటి స్థానం. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో రూ.20,339 కోట్ల మొండి రుణాలను రద్దు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లన్నీ కలిపి మొత్తం రూ.81,683 కోట్ల మొండి బకాయిలను రద్దు చేయగా, అందులో ఎస్‌బీఐ వాటాయే అత్యధికం. ఈ గణాంకాలు కూడా అనుబంధ బ్యాంకుల విలీనానికి ముందువే కావడం గమనార్హం. 2012-13లో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లన్నీ కలిపి రూ.27,231 కోట్ల మొండి బకాయిలను రద్దు చేయగా, ఆ తర్వాత మూడేళ్లలో ఈ మొత్తం ఐదు రెట్లు పెరిగింది. 2013-14లో రూ.34,409 కోట్లు, 2014-15లో రూ.49,018 కోట్లు, 2015-16లో రూ.57,585 కోట్లు, 2017 మార్చికల్లా మరో రూ.81,683 కోట్ల బకాయిలను రద్దు చేసినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అత్యధికంగా రూ.9,205 కోట్ల మొండి బకాయిలను రద్దు చేయగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.7,346 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.5,545 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.4,348 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లోని తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్)నూ పీఎస్‌బీలు మరో రూ.53,625 కోట్ల మొండి బకాయిలను రద్దు చేశాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NEW DELHI: The Finance Ministry has nominated eight tax officers to handle GST-related queries on social media site Twitter, according to an official order. It has been decided to assign the charge of handling of queries related to the Goods and Services Tax on Twitter/Email to the eight officers with immediate effect, it said.The officers - all of them assistant commissioners - have been chosen from neighbouring commissionerates under the ministry.They are Raj Karan Agarwal, Rajni Sharma, Raunaq Jamil Ansari, Shantanu, Bullo Mamu, Heera Lal, Manish Chaudhary and Anshika Agarwal, the order said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి