EPFO: 35 రోజుల ఆలస్యానికి వడ్డీ కట్టాల్సిందే.. 6 శాతం పెనాల్టీ!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) సంస్థకు ముంబైకి చెందిన వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. సీరియస్ వార్నింగ్ లాంటి సంచలన తీర్పును వెలువరించింది. పదవీ విరమణ చేసిన ఒక ఉద్యోగికి చెందాల్సిన ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడంలో చేసిన జాప్యానికి గాను, ఆ ఆలస్యమైన సమయానికి వడ్డీ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలైనా సరే.. నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా సేవలు అందించకపోతే బాధ్యత వహించక తప్పదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.
ముంబై సబర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ఇటీవల ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఫ్లీట్ మెరైన్ సర్వీసెస్ సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఒక ఉద్యోగికి చెందిన రూ. 14,06,272 క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేయడంలో ఈపీఎఫ్‌ఓ నిర్లక్ష్యం వహించిందని కోర్టు నిర్ధారించింది. ఈపీఎఫ్ స్కీమ్ 1952 నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన 20 రోజుల్లోగా పీఎఫ్ డబ్బులను సెటిల్ చేయాల్సి ఉంది. అయితే, 2016 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 13 వరకు జరిగిన 35 రోజుల ఆలస్యానికి గాను సదరు ఉద్యోగికి సంవత్సరానికి 6 శాతం చొప్పున వడ్డీని చెల్లించాలని ఈపీఎఫ్‌ఓను కమిషన్ ఆదేశించింది.

సాకులు చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. తిరస్కరించిన కోర్టు!
సదరు ఉద్యోగి 2016 అక్టోబర్ 19న పూర్తి వివరాలతో దరఖాస్తు దాఖలు చేశారని పేర్కొనగా, ఈపీఎఫ్‌ఓ తన తరఫున విచిత్రమైన వాదనను వినిపించింది. ఉద్యోగి ఇచ్చిన మొదటి దరఖాస్తులో జాయింట్ డిక్లరేషన్ పత్రాలు సరిగా లేవని, అందుకే ఆ కాగితాలను నవంబర్ 7న తిరిగి వెనక్కి పంపినట్లు తెలిపింది. ఆ తర్వాత డిసెంబర్ 2న పూర్తి సమాచారంతో కూడిన దరఖాస్తు అందిందని, అక్కడ నుంచి లెక్కిస్తే 20 రోజుల్లోపే అంటే డిసెంబర్ 14న పీఎఫ్ క్లెయిమ్‌ను పూర్తి చేశామని వాదించింది. అయితే, మొదట సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందనడానికి లేదా దానిని తిరస్కరిస్తూ ఉద్యోగికి పంపినట్లుగా ఎలాంటి ఆధారాలను ఈపీఎఫ్‌ఓ కోర్టు ముందు ఉంచలేకపోయింది.
సేవల లోపమే కారణం.. 45 రోజుల్లోగా చెల్లించాల్సిందే!
ఉద్యోగి సమర్పించిన ఆధారాలను పరిశీలించిన వినియోగదారుల కమిషన్.. ఈపీఎఫ్‌ఓ వాదనల్లో ఎలాంటి బలం లేదని తేల్చి చెప్పింది. 2016 అక్టోబర్ 19న వచ్చిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందనడానికి సంస్థ వద్ద తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌ను పరిష్కరించకపోవడం కచ్చితంగా ఈపీఎఫ్‌ఓ అందించిన "సేవల లోపమే"నని తేల్చింది. ఈ జాప్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ, బాధితుడికి 6 శాతం వడ్డీతో కలిపి పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఈపీఎఫ్‌ఓకు గడువు విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.














Click it and Unblock the Notifications
