దసరా, దీపావళికి ఊహించని షాక్! ఫ్లైట్ టికెట్ ధరలు ఎంతంటే..
దసరా, దీపావళి వచ్చిందంటే చాలు.. సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడపాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మెట్రో నగరాల్లో ఉండే ఉద్యోగస్తులకు పండుగ ప్రయాణమే ఒక పెద్ద ప్రహసనంగా మారుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో సొంతూర్లకు వెళ్లేవారికి విమానయాన సంస్థలు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విమాన సంస్థలు వసూలు చేస్తున్న భారీ ఛార్జీలపై సామాన్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఢిల్లీ-బెంగళూరు టికెట్ రూ.20 వేలు దాటింది!
ముఖ్యంగా దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ వంటి కీలక మార్గాల్లో విమాన నిమిత్తం అయ్యే ఖర్చు చూసి ప్రయాణికులు షాక్ అవుతున్నారు. సాధారణ రోజుల్లో తక్కువ ధరకు లభించే టికెట్లు ఇప్పుడు రూ.20,000 మార్కును సులువుగా దాటేశాయి. రెండేళ్ల క్రితం దీపావళి సమయంలో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లిరావడానికి (అటు ఇటు కలిపి) సుమారు రూ.13,000 అయ్యేదని, ఇప్పుడు కేవలం ఒక్క వైపుకే రూ.20,000 దాటిపోతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పండుగకి ఇంటికి వెళ్లాలా వద్దా అనే సందేహంలో పడిపోయామని పలువురు వాపోతున్నారు.

విదేశీ ప్రయాణాలే నయమంటున్న నెటిజన్లు!
సోషల్ మీడియా వేదికగా విమాన ఛార్జీల బాదుడుపై ప్రయాణికులు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లేకంటే.. థాయ్‌లాండ్, మలేషియా వంటి విదేశాలకు వెళ్లడం చౌకగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎయిర్‌లైన్స్ సంస్థల మధ్య పోటీ తగ్గుముఖం పట్టడం, విమాన ఇంధన ధరల పెరుగుదల, రూపాయితో పోలిస్తే డాలర్ విలువ పెరగడం వల్ల విమానాల లీజు ఖర్చులు భారం కావడం లాంటి కారణాల వల్ల విమాన సంస్థలు ప్రయాణికులపై ఈ భారాన్ని మోపుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
పండుగల వేళ సాధారణ రైళ్లలో బెర్తులు దొరక్క, ప్రైవేటు బస్సుల్లో విపరీతమైన ఛార్జీలు భరించలేక ప్రత్యామ్నాయంగా విమానాలను ఆశ్రయించే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఈ ధరల భారం పెద్ద దెబ్బగా మారింది. పండుగ సీజన్లలోనైనా విమాన ఛార్జీలపై గరిష్ట పరిమితి (Cap) విధించి, విమానయాన సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు














Click it and Unblock the Notifications
