'నూతన స్వాతంత్య్ర సమరయోధులుగా మారండి'.. యువతకు గౌతమ్ అదానీ పిలుపు
Gautam Adani: ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబిలీ సందర్భంగా గౌతమ్ అదానీ భారత సాంకేతిక పురోగతిని "రెండో స్వాతంత్య్ర పోరాటం'గా అభివర్ణించారు. ఈ పోరాటంలో ఆవిష్కరణలు, స్వావలంబన, సామూహిక సంకల్పం చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా విద్యార్థులు 'నూతన స్వాతంత్య్ర సమరయోధులు'గా మారాలని ఆయన పిలుపునిచ్చారు.
కొత్త శత్రువులు, యుద్ధాలు
1930ల నాటి యువ స్వాతంత్య్ర సమరయోధులు బందీలుగా ఉన్నఖరగ్‌పూర్‌లోని హిజ్లీ జైలును అదానీ గుర్తు చేసుకున్నారు. అప్పటి బ్రిటీష్ పాలన నుంచి 1947లో స్వాతంత్య్రం వచ్చినా, ఇప్పుడు మనం కొత్త రకాల పరాధీనతలను ఎదుర్కొంటున్నామని ఆయన హెచ్చరించారు. దిగుమతి చేసుకున్న సెమీకండక్టర్లు, విదేశీ చమురు, సరిహద్దుల గుండా డేటా ప్రవాహాలు, దిగుమతి చేసుకున్న రక్షణ వ్యవస్థలు వంటి వాటిపై మనం ఆధారపడటం ఇప్పటికీ కొనసాగుతుందని ఆయన అన్నారు. గౌతమ్ అదానీ ఈ కొత్త సవాళ్లను 'కనిపించని యుద్ధాలు'గా వర్ణించారు. "ఈ యుద్ధాలు కందకాలలో కాకుండా సర్వర్ ఫారమ్‌లలో జరుగుతాయి. ఇక్కడ ఆయుధాలు తుపాకులు కాదు, అల్గారిథమ్స్. సామ్రాజ్యాలు భూమిపై కాకుండా డేటా సెంటర్లలో నిర్మించబడుతున్నాయి." అని ఆయన వివరించారు.

నూతన స్వాతంత్య్ర సమరయోధులు.. విద్యారంగం
గౌతమ్ అదానీ విద్యార్థులను ఉద్దేశించి.. "మీరు భారత్‌కు నూతన స్వాతంత్ర్య సమరయోధులు" అని అన్నారు. ఆధునిక ఆయుధాలు ఆలోచనలు, కోడ్, ఆవిష్కరణలేనని, ఇవే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (AI) పెరుగుతున్న కారణంగా, కేవలం తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోజనాలు కనుమరుగవుతాయని, కాబట్టి మేధో సంపత్తి,ఆవిష్కరణలను విస్తృతంగా పెంచుకునే దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని ఆయన సూచించారు. విద్యార్థులు కేవలం పట్టభద్రులుగా ఉండకుండా, దేశాభివృద్ధికి ప్రత్యక్షంగా సహకరించే "అద్భుతమైన దేశభక్తులు"గా మారాలని విద్యాసంస్థలను అదానీ కోరారు.
పరిశ్రమల సహకారం
భారతీయ కార్పొరేట్ సంస్థలు ఆవిష్కరణల విషయంలో తమ వంతు బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని గౌతమ్ అదానీ అంగీకరించారు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య లోతైన సహకారం అవసరమని, దీనివల్ల ప్రయోగశాలలు, వాణిజ్య సంస్థల మధ్య సరిహద్దులు అదృశ్యమవుతాయని ఆయన ప్రతిపాదించారు. "విశ్వవిద్యాలయాలు అద్భుతమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి, కార్పొరేట్ సంస్థలు వాటిని భారీ స్థాయిలో అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే మనం కలిసికట్టుగా గణనీయమైన ప్రభావాన్ని చూపగలమని ఆయన అన్నారు. ఈ ఉద్దేశంతో పునరుత్పాదక ఇంధనం, ఓడరేవులు, లాజిస్టిక్స్, స్మార్ట్ విమానాశ్రయాలు వంటి రంగాలలో అత్యుత్తమ ఐఐటీ విద్యార్థులకు అవకాశం కల్పించడానికి 'అదానీ-ఐఐటీ ప్లాటినమ్ జూబిలీ ఛేంజ్ మేకర్స్ ఫెలోషిప్'ను ఆయన ప్రకటించారు.
యువతరానికి గౌతమ్ అదానీ నాలుగు సూత్రాలు
మెరుగైన భారత్‌ను నిర్మించడానికి గౌతమ్ అదానీ విద్యార్థులకు నాలుగు ముఖ్య సూత్రాలను సూచించారు.
*నూతన స్వాతంత్య్ర సమరయోధులుగా ఉండండి: ఆలోచనలు, ఆవిష్కరణలను మీ ఆయుధాలుగా ఉపయోగించుకోండి.
*మొదట భారత్ కోసం నిర్మించండి: ప్రపంచ మార్కెట్ల గురించి ఆలోచించే ముందు, రైతులు, మత్స్యకారులు, సామాన్య పౌరులకు ఉపయోగపడే పరిష్కారాలను రూపొందించండి.
*జాతీయ పునాదులను పటిష్టం చేయండి: మౌలిక సదుపాయాలు, సాంకేతికత, మేధో సంపత్తి రంగాలలో బలమైన పునాదులను నిర్మించండి.
*ఒక బృందంగా ముందుకు సాగండి: విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం కలిసికట్టుగా ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి.
చివరగా అదానీ విద్యార్థులకు ఒక శక్తివంతమైన సవాలు విసిరారు. "త్వరలో మీ చేతుల్లో రెండు టికెట్లు ఉంటాయి - ఒకటి మంచి జీతం కోసం, మరొకటి భారత్‌ను నిర్మించే వారసత్వం కోసం. దేశ నిర్మాణాన్ని గమ్యస్థానంగా చేసుకున్న రైలులో ఒక్కటే ప్రయాణం ఉంటుంది. మీరు ఏ రైలును ఎంచుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications