పసిడి మార్కెట్ లో పెను భూకంపం! కుప్పకూలిన రేట్లు..
బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగానే ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు దారుణంగా పతనమయ్యాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్ విపరీతంగా బలం పుంజుకోవడం వంటి ప్రధాన కారణాల వల్ల బంగారం ధరలు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం.. స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 2 శాతం వరకు తగ్గి, ఔన్సుకు (Ounce) సుమారు $4,365 మార్కుకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుండి చూసుకుంటే బంగారం ధరలు ఏకంగా 17 శాతం కంటే ఎక్కువ పతనమై, ఈ ఏడాది సాధించిన లాభాలన్నింటినీ దాదాపుగా తుడిచిపెట్టేయడం గమనార్హం.

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న రణరంగం!
ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు హఠాత్తుగా వైమానిక దాడులు చేశాయి. దీనికి ప్రతిగా, తమపై దాడి ప్రారంభించిన అమెరికా బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఎదురుదాడికి దిగిందని సమాచారం. మరోవైపు కువైట్ వైమానిక దళాలు కూడా క్షిపణి, డ్రోన్ బెదిరింపులను తిప్పికొట్టాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల పట్ల తాను "సంతృప్తిగా లేను" అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య సంక్షోభానికి తక్షణ పరిష్కారం లభిస్తుందనే ఆశలపై నీళ్లు చల్లాయి.
ముడిచమురు సెగ.. వడ్డీ రేట్ల భయాలు!
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన జలమార్గమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణం నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బ్రెంట్ ముడిచమురు (Brent Crude Oil) ధర బ్యారెల్‌కు ఏకంగా $98 మార్కును తాకింది. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మరింత ఎక్కువవుతుందని ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి.
ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం తప్పుడు దిశలో సాగుతోందని, ఇది ఇలాగే కొనసాగితే వడ్డీ రేట్లు పెంచడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే వాతావరణంలో బంగారం ధరలు తగ్గుతాయి. ఎందుకంటే బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా బాండ్ల వైపు మళ్లిస్తారు.
'సేఫ్ హెవెన్' గా క్రేజ్ కోల్పోతున్న బంగారం!
ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా.. సురక్షితమైన పెట్టుబడిగా (Safe Haven) అందరూ బంగారాన్ని కొనేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వ్యాపారులు ఇప్పుడు బంగారంపై నమ్మకాన్ని కోల్పోతున్నారని, లాభాలు ఇచ్చే ఇతర హై-ప్రొఫైల్ స్టాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారని గ్లోబల్ ఎక్స్ ఎఫ్‌టిఎఫ్‌ల ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ జస్టిన్ లిన్ విశ్లేషించారు. చమురు ధరలు ఇలాగే పెరిగితే, బంగారం ధర మరింత తగ్గి $4,000 నుండి $4,250 శ్రేణిలో సపోర్ట్ వెతుక్కునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ప్రస్తుతం సింగపూర్ మార్కెట్ వేళల ప్రకారం.. స్పాట్ గోల్డ్ 1.8% తగ్గి ఔన్సుకు $4,374.11 వద్ద ట్రేడవుతోంది. కేవలం బంగారమే కాకుండా వెండి ధర కూడా 3.6% తగ్గి $71.98 కి పడిపోయింది. ప్లాటినం, పల్లాడియం వంటి ఇతర విలువైన లోహాలు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి తోడు బ్లూమ్‌బర్గ్ డాలర్ ఇండెక్స్ 0.3% పెరిగి వరుసగా మూడో రోజు లాభపడటం కూడా బంగారం పతనానికి మరింత కారణమైంది.














Click it and Unblock the Notifications