భారీగా తగ్గిన బంగారం ధరలు.. అక్కడ ఒక్కచోట మాత్రమే
ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలపై ఒప్పందాలు చేసుకోకపోవడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయి. దీనికి తోడు, యూఎస్ డాలర్ వారం కనిష్టానికి పడిపోవడంతో పసిడి ధరలు మరింత పెరిగాయి.
అయితే, తాజాగా ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3390 డాలర్ల దిగువకు చేరింది. కిందటి రోజు ఇది 3450 డాలర్లపైన ఉండేది. ఇదే సమయంలో సిల్వర్ రేటు 39 డాలర్లపైనే ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.44 వద్ద ఉంది.

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పటికీ, దేశీయంగా మాత్రం బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ. 950 పెరిగి తులం రూ. 93,800కు చేరింది. అంతకుముందు రోజు రూ. 1050 పెరిగింది. ఇలా వరుసగా పెరుగుతూ బంగారం ధరలు మళ్లీ గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా రూ. 1040 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,02,330 వద్ద ఉంది. అంతకుముందు రోజు ఇది రూ. 1140 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరల ప్రభావం ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత దేశీయ మార్కెట్‌లో కనిపించే అవకాశం ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే రూ. 1000 పెరగడంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 1.29 లక్షల వద్ద ఉంది. అంతకుముందు రోజు రూ. 2 వేలు పెరిగింది.












Click it and Unblock the Notifications