దీపావళి ధమాకా.. రెట్రో లుక్‌లో హీరో కొత్త స్కూటర్ లాంచ్! ధర, ఫీచర్లు అదుర్స్!
దేశంలోని ప్రజలకు చాలా వరకు ఎక్కువగా నచ్చే ఫెస్టివల్ దీపావళి పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పండుగ సీజన్‌ను మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారతీయ మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. 110 సీసీ సెగ్మెంట్లో అత్యంత ఆదరణ పొందిన డెస్టిని స్కూటర్‌కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన 'హీరో డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్'ను గురువారం అధికారికంగా విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.76,400గా కంపెనీ నిర్ణయించింది.
ఈ కొత్త క్లాసిక్ ఎడిషన్‌లో హీరో మోటోకార్ప్ ప్రధానంగా 'నియో-రెట్రో' స్టైలింగ్పైనే పూర్తి దృష్టి సారించింది. ఈ స్కూటర్లో ఇంజన్, అంతర్గత యాంత్రిక విభాగాల్లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ.. వెలుపలి డిజైన్ పరంగా పండుగ వాతావరణానికి తగినట్లు సరికొత్త కాస్మెటిక్ అప్డేట్స్ను అందించారు. క్లాసిక్ లుక్ కోసం ఇందులో రెండు ప్రత్యేకమైన డ్యూయల్-టోన్ రంగులను పరిచయం చేశారు. అందులో మొదటిది మాట్ గోల్డ్‌ఫిష్ సిల్వర్ / లైట్ ఇండస్ట్రియల్ గ్రే(గోధుమ రంగు ఇన్నర్ ప్యానెల్స్‌తో) కాగా.. రెండోది మాట్ ఏరీస్ బ్రౌన్(నలుపు రంగు ఇన్నర్ ప్యానెల్స్‌తో) లభిస్తుంది.

డిజైన్ ప్రాధాన్యతలను పరిశీలిస్తే.. ఫ్రంట్ హ్యాండిల్ కవర్, సైడ్ ప్యానెల్స్‌పై సరికొత్త స్ట్రైప్స్ ఇచ్చారు. దీనికి తోడు బాడీ కలర్లోనే ఉండే మిర్రర్స్, ప్రత్యేకమైన '3D క్లాసిక్ ఎడిషన్' బ్యాడ్జింగ్, బ్రాండెడ్ రిమ్ టేప్, అదనపు క్రోమ్ డీటైలింగ్ స్కూటర్ కు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. రైడర్, ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ స్కూటర్లో రైడింగ్ స్పేస్‌ను మెరుగుపరిచారు. ఈ సెగ్మెంట్లోనే అత్యంత పొడవైనదిగా చెప్పబడుతున్న 785 మిల్లీమీటర్ల పొడవైన సీటును ఇందులో ఏర్పాటు చేశారు. దీని వల్ల సుదీర్ఘ ప్రయాణాల్లోనూ మంచి కంఫర్ట్ లభిస్తుంది. అలాగే కాళ్లు ఉంచుకోవడానికి ఎక్కువ లెగ్ రూమ్‌తో పాటు సీటు కింద 19 లీటర్ల విశాలమైన అండర్-సీట్ స్టోరేజ్ సామర్థ్యాన్ని అందించారు.
ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఇందులో నమ్మకమైన 110 సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. మైలేజ్ పెంచేందుకు వీలుగా హీరోకు చెందిన పేటెంట్ 'i3s'(ఐడల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు. దీని ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయి ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ఈ స్కూటర్లో 12 ఇంచుల అలాయ్ వీల్స్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్, చీకటిలో ఉపయోగపడే బూట్ లాంప్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. పండుగ సీజన్ వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈ హీరో డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ స్కూటర్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హీరో అధికారిక డీలర్‌షిప్‌లలో విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి.














Click it and Unblock the Notifications
