వ్యాపారం బంద్.. వేల కోట్ల పెట్టుబడులు గోవిందా..!
పశ్చిమ ఆసియాలో ఇరాన్-అమెరికా మధ్య రేగిన ఉద్రిక్తతలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు.. అవి వేలాది మంది భారతీయ పారిశ్రామికవేత్తల కలలను, వేల కోట్ల రూపాయల పెట్టుబడులను నీటిపాలు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా యూఏఈని (UAE) తమ రెండో నివాసంగా మార్చుకున్న భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEలు) ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. దాదాపు రూ.12,000 కోట్ల ($1.3 బిలియన్లు) పెట్టుబడులు ప్రస్తుతం యుద్ధం అంచున వేలాడుతున్నాయి.
గత రెండేళ్లుగా అమెరికా తర్వాత భారతీయ సంస్థలకు యూఏఈ అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా మారింది. అంతర్జాతీయంగా ఎదగాలని దుబాయ్, అబుదాబిలను ఎంచుకున్న మన స్టార్టప్‌లు, మధ్య తరహా సంస్థలకు ఈ యుద్ధ వాతావరణం పెనుశాపంగా మారింది. ఆర్బీఐ (RBI) గణాంకాల ప్రకారం.. గత ఆరు నెలల్లోనే భారతీయ కంపెనీలు యూఏఈలో భారీగా నిధులు కుమ్మరించాయి. రిటైల్, ఆతిథ్యం (Hospitality) రంగాల్లోని 280 సంస్థలు సుమారు $400 మిలియన్ల పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు పర్యాటకం దెబ్బతింటే, ఈ సంస్థల ఆదాయం పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ముప్పులో దిగ్గజాలు.. చిన్న బ్రాండ్లు!
యూఏఈ మార్కెట్‌లో పాగా వేసిన గ్రేవిస్ ఫుడ్స్ ($11.4 మిలియన్లు), ఓయో ప్రాప్‌టెక్ ($11 మిలియన్లు), హల్దీరామ్ ($2.8 మిలియన్లు) వంటి పెద్ద కంపెనీలతో పాటు.. 'బ్రహ్మ లైఫ్‌స్టైల్' ($2 మిలియన్లు), 'సబ్‌కో కాఫీ' వంటి చిన్న బ్రాండ్లు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. పెద్ద కంపెనీలకు నష్టాలను తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ, చిన్న సంస్థలు తమ వద్ద ఉన్న మొత్తం మూలధనాన్ని ఇక్కడే పెట్టడం వల్ల, వ్యాపారం కొద్ది నెలలు ఆగినా అవి దివాలా తీసే (Bankruptcy) అవకాశం ఉంది.
MSMEలను కుంగదీస్తున్న మూడు ప్రధాన కారణాలు:
- నిధుల కొరత: చిన్న సంస్థలకు అదనపు నిధులు ఉండవు. వ్యాపార చక్రం ఆగితే అవి కోలుకోవడం అసాధ్యం.
- బీమా లేకపోవడం: చాలా చిన్న సంస్థలకు 'యాక్టివ్ వార్ ఇన్సూరెన్స్' (Active War Insurance) లేదు. యుద్ధం వల్ల ఆస్తులు దెబ్బతిన్నా వీరికి పరిహారం లభించదు.
- రవాణా ఖర్చులు: సముద్ర, వైమానిక మార్గాల్లో ఆటంకాలు కలగడంతో ఎగుమతి, దిగుమతి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇది వారి లాభాలను పూర్తిగా హరించివేస్తోంది.












Click it and Unblock the Notifications