టూత్ పిక్స్ వ్యాపారం.. చైనాకు ఇన్ని కోట్లా?
భారత్ సాంకేతిక రంగంలో ఎంతో వేగంగా అభివృద్ది చెందుతోంది. మన దేశం నుంచి రోదసిలోకి రాకెట్లను పంపే స్థాయికి వెళ్లాం. కానీ సాంకేతిక రంగంలో ఎంత పురోగతి ఉన్నా.. నిత్యజీవితంలో వాడే చిన్న వస్తువుల కోసం చైనాపై ఆధారపడటం ఆందోళన కలిగిస్తోంది. రోదసిలోకి రాకెట్లను పంపించే టెక్నాలజీ ఉన్న భారత్.. టూత్ పిక్స్, చీపుర్లు, ప్లాస్టిక్ సామాన్లు, చివరకు నిరసనల్లో వాడే జెండాల కోసం కూడా చైనాపై ఆధారపడాల్సి రావడం విస్తుగొలిపే నిజం.
చీపుర్లకు రూ.800 కోట్లు
మనదేశంలో వాడే చీపుర్లు, ప్లాస్టిక్ వస్తువులు, టూత్ పిక్స్(పళ్లపుల్లలు) వంటి చిన్న వస్తువులను కూడా చైనా నుంచి వందల కోట్ల రూపాయల వ్యయంతో దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి ఏడాది దాదాపు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల విలువైన చీపుర్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. దేవుళ్ల విగ్రహాలను కూడా దిగుమతి చేసుకోవడం. ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన విగ్రహాలను విదేశాల నుంచి తెప్పించుకుంటున్నాం.

టూత్ పిక్స్ కోసం రూ.125 కోట్లు
రూ.83 కోట్ల నుంచి రూ.125 కోట్ల విలువైన టూత్ పిక్స్(పళ్లపుల్లలును, రూ.150 కోట్ల విలువైన సోప్ బాక్సులను దిగుమతి చేసుకుంటున్నాం. చెప్పుల కోసం రూ.3,000 కోట్లకు పైగా.. టీ కప్పుల కోసం రూ.150 కోట్లు.. ప్లాస్టిక్ ప్లేట్ల కోసం రూ.200 కోట్లు, అగరబత్తుల కోసం రూ.300 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నాం. మొక్కజొన్న కంకుల వ్యర్థాల నుంచి చైనా ఫ్లైవుడ్ తయారు చేసి.. మళ్లీ ఇండియాకే దాదాపు రూ.400 కోట్లకు దిగుమతి చేస్తోంది.
జెండాలు కూడా దిగుమతేనా?
మన దేశంలో స్థానికంగా జరిగే నిరసనలు, రాజకీయ ఆందోళనల్లో ఉపయోగించే జాతీయ జెండాలు, టేబుల్ పిన్లు కూడా చైనా నుంచి దిగుమతి కావడం గమనార్హం. దీని కోసం ప్రతి ఏటా దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు భారత్ ఖర్చు చేస్తోంది. సాధారణంగా ఈ వస్తువులను ఇండియాలోనే తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ స్థానిక తయారీ లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారత్.. ఇలాంటి చిన్న చిన్న వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగించే విషయం.
యువత బాధ్యత
ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి కలిగిన దేశం అయినప్పటికీ.. నేటి జెన్-జెడ్, జెన్-ఆల్ఫా యువత సోషల్ మీడియా రీల్స్, లైకులు, కామెంట్లు లేదా రాజకీయ నాయకులు, సినీ స్టార్ల వెనుక సమయాన్ని వృథా చేస్తూ డిజిటల్ బానిసలుగా మారుతున్నారు. ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి స్పందించాలని చూడకుండా.. యువత స్థానికంగా చిన్న చిన్న యూనిట్లను ప్రారంభించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications