Inflation: జీఎస్టీ 2.0 తర్వాత మరో గుడ్ న్యూస్- 8 ఏళ్ల తర్వాత ఊరట..!
దేశంలో ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ధరలు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరి 1.54 శాతంగా నమోదైంది. ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఫలించడంతో ద్రవ్యోల్బణం బాగా తగ్గుతోంది. ఆగస్టు నెలలో ఇది 2.07గా ఉండగా.. సెప్టెంబర్ నాటికి 1.54 శాతానికి తగ్గింది. మరోవైపు జీఎస్టీ సంస్కరణల కారణంగా తగ్గిన రేట్లు కూడా దీనికి కారణంగా కనిపిస్తున్నాయి.
2017 జూన్ లో ద్రవ్యోల్బణం 1.7 శాతంగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ పోయింది. దీన్ని అదుపు చేసేందుకు కేంద్రం, ఆర్బీఐ ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. ఎట్టకేలకు సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వినియోగదారుల ధరల సూచీలో సగం ఆక్రమించే ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 2.28 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది మైనస్ 0.69 శాతంగా ఉంది.

అలాగే కూరగాయల ధరలు కూడా బాగా తగ్గాయి. ఆగస్టులో 15.92 శాతం తగ్గిన కూరగాయల ధరలు.. సెప్టెంబర్ లో 21.38 శాతం తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణం బాగా తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించకుండా స్దిరంగా ఉంచుతోంది. ప్రస్తుత సానుకూల ద్రవ్యోల్బణ వాతావరణం వృద్ధిని ప్రోత్సహించడానికి మరిన్ని వడ్డీ రేట్ల కోతలకు అవకాశం కల్పిస్తుందని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ప్రకటించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను 3.1 శాతం నుంచి 2.6 శాతానికి సవరించింది. అలాగే త్రైమాసిక అంచనాలు Q2 మరియు Q3లో 1.8 శాతం నుండి Q4లో 4 శాతానికి ఉన్నాయి. దీనిపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. గత కొన్ని నెలల్లో ఆహార ధరలు గణనీయంగా తగ్గడం, జీఎస్టీ రేట్ల కోత కారణంగా మొత్తం ద్రవ్యోల్బణ దృక్పథం మరింత సానుకూలంగా మారిందని తెలిపారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , సుంకాల సంబంధిత వాణిజ్య అంతరాయాలు ద్రవ్యోల్బణ దృక్పథానికి ప్రమాదాలుగా ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications