మెటా $1 బిలియన్ ఆఫర్ రిజెక్ట్ చేసిన మీరా.. ఆమె ఎవరు ? ఆ స్టోరీ ఏంటి ??
మారుతున్న కాలానుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పోటీ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ క్రమంలో మెటాకు పెద్ద షాక్‌గా.. పైటార్చ్ సహ-సృష్టికర్త, మెటాలో కీలక పాత్ర పోషించారు సౌమిత్ చింతల. ఇప్పుడు తన 11 ఏళ్ల ప్రయాణం ముగించి మీరా మురాటి స్థాపించిన Thinking Machines Lab లో చేరడం పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
$1 బిలియన్ ఆఫర్ రిజక్ట్..
కాగా ఈ మేరకు Thinking Machines Labను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా మీరా మురాటికి $1 బిలియన్ ఆఫర్ ఇచ్చారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే మురాటి తన స్టార్టప్ విజన్, స్వతంత్రతను కాపాడుకునేందుకు ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయం AI ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. భారీ కంపెనీలకు స్వతంత్ర స్టార్టప్‌ల విలువ ఎంత ప్రత్యేకమైనదో చూపించింది.

స్టార్టప్ కొనుగోలు విఫలమైన తర్వాత.. మెటా మరో వ్యూహాన్ని అవలంబించినట్లు తెలుస్తోంది. జుకర్‌బర్గ్ స్వయంగా Thinking Machines Lab లోని దాదాపు డజను మంది ఉద్యోగులతో సంప్రదించి మెటాలో చేరేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రూ టులోచ్ వంటి టాప్ పరిశోధకులను లక్ష్యంగా చేసుకుని భారీ పరిహార ప్యాకేజీలతో రిక్రూట్ చేయడానికి ప్రయత్నించారు. పరిహార అంచనాలు $200 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు వెళ్లడం పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.
సౌమిత్ చింతల మెటాకు బై బై..
అయితే సౌమిత్ చింతల LinkedIn, X వేదికల్లో తన రాజీనామాను ధృవీకరిస్తూ భావోద్వేగంతో కూడిన పోస్టులు చేశారు. మెటాలో 11 ఏళ్ల ప్రయాణంలో పైటార్చ్ అభివృద్ధికి ఎనిమిది సంవత్సరాలు నాయకత్వం వహించిన ఆయన.. ఏమీ లేని స్థితి నుండి పైటార్చ్‌ను AI పరిశ్రమలో 90% స్వీకరణ స్థాయికి తీసుకువచ్చిన ప్రయాణం కెరీర్‌లో అత్యంత గొప్ప ఘట్టం" అని పేర్కొన్నారు. పైటార్చ్ అభివృద్ధిలో ఆయన చేసిన పని ప్రపంచ AI పరిశోధనకు ఒక పునాది అయినట్లు నిపుణులు చెబుతున్నారు.
సౌమిత్ వెళ్లిపోతున్న సమయంలోనే మెటా పెద్ద పునర్వ్యవస్థీకరణలో ఉంది. సంస్థ తన AI విభాగాలను Superintelligence Labs పేరుతో ఒకే అంబ్రెల్లా కిందకు తీసుకొస్తూ, ఈ విభాగానికి ScaleAI మాజీ CEO అలెగ్జాండర్ వాంగ్‌ను నాయకుడిగా నియమించింది. ఓపెన్‌ఏఐ, గూగుల్ డీప్‌మైండ్, ఆపిల్ వంటి ప్రముఖ సంస్థల నుంచీ పలువురు పరిశోధకులను రిక్రూట్ చేస్తూ మెటా తన సూపర్‌ఇంటెలిజెన్స్ లక్ష్యాలను వేగవంతం చేస్తోంది.
మరోవైపు మీరా మురాటి స్థాపించిన Thinking Machines Lab, ప్రపంచ AI స్టార్టప్‌లలో వేగంగా ఎదుగుతున్న సంస్థగా మారింది. పరిశ్రమలలో మానవ-AI సహకారాన్ని పెంచే మోడల్‌లు, టూల్స్ అభివృద్ధి మీద దృష్టి పెట్టింది ఈ సంస్థ. ప్రస్తుతం సుమారు $50 నుంచి $60 బిలియన్ విలువతో కొత్త నిధుల రౌండ్ కోసం చర్చలు జరుపుతోంది. ఒక సంవత్సరంలోనే విలువను నాలుగు రెట్లు పెంచుకోవడం ఈ స్టార్టప్ సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
AI పరిశ్రమపై దీని ప్రభావం..
సౌమిత్ చింతల Thinking Machines Lab లో చేరడం, మురాటి నాయకత్వంతో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రపంచ AI పోటీలో ఒక కొత్త పథానికి తీసుకువెళ్లగలదనే అంచనాలు ఉన్నాయి. మెటా, OpenAI, DeepMind, Anthropic వంటి దిగ్గజాలకు ప్రత్యక్ష పోటీగా TML ఎదగడం పరిశ్రమలో కొత్త శక్తి సమీకరణాలు ప్రారంభమవుతున్న సంకేతం అని అభివర్ణిస్తున్నారు.












Click it and Unblock the Notifications