సినిమా టికెట్ ధర రూ.200కే పరిమితం.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 4,08,647 కోట్ల అంచనా వ్యయంతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వినోద రంగం, మైనారిటీ సంక్షేమం, మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూనే, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్ల ధరలను రూ.200లకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల సామాన్యులకు కూడా సినిమా మరింత చేరువ కానుందని వెల్లగించారు.
మల్టీప్లెక్స్‌ల దోపిడీకి చెక్:
మల్టీప్లెక్స్‌లలో సినిమా టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో సహా అన్నింటిలోనూ సినిమా టిక్కెట్ల ధరలను రూ.200లకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక సినీ పరిశ్రమలో ఇది దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. గతంలో మల్టీప్లెక్స్‌లు అధిక బడ్జెట్ కన్నడ, అంతర్జాతీయ సినిమాల ప్రీమియం షోల కోసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేసేవి.

2017లో కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగినా, న్యాయపరమైన చిక్కుల కారణంగా అది అమలు కాలేదు. అయితే, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ సంస్కరణను అమలు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం సిద్దా రామయ్య తెలిపారు.
కన్నడ సినీ పరిశ్రమకు చేయూత:
కన్నడ సినీ పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు, ప్రాంతీయ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఒక OTT ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, మైసూరులో 150 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఫిల్మ్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనిని పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేస్తారు. దీనికోసం సుమారు రూ.500 కోట్ల పెట్టుబడిని అంచనా వేసింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిద్దా రామయ్య ప్రకటించారు.
ముఖ్యమంత్రి ట్వీట్:
బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందిస్తూ, "ఈ రోజు నా రాజకీయ జీవితంలో 16వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని పోస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌ను పదహారు సార్లు ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన కర్ణాటక ప్రజలందరికీ నేను కృతజ్ఞుడను. బుద్ధుడు, బసవన్న, గాంధీ, అంబేద్కర్‌ల ఆశయాలను విశ్వసిస్తూ, వాటికి అనుగుణంగా నడుచుకుంటూ, ఈ బడ్జెట్ ద్వారా సమానత్వ సమాజం కలను సాకారం చేసే దిశగా మరో ముందడుగు వేసే ప్రయత్నం చేశాం" అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications