Ambani on Gold: అంబానీ చెప్పిన పెట్టుబడి ప్లాన్, ఇలా చేస్తేనే లాభం!
భారతీయుడు అంటే పొదుపుదారుడిగా ప్రసిద్ధుడు. తరతరాలుగా బంగారం, వెండినే భద్రతగా నమ్ముకున్న మన మనస్తత్వం.. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) స్పష్టం చేశారు. ఈ పొదుపును ఉత్పాదకంగా మార్చి, మూలధన మార్కెట్ల వైపు మళ్లించడమే జియో బ్లాక్‌రాక్ లక్ష్యమని ఆయన వెల్లడించారు. "సురక్షితమైన, పారదర్శకమైన, స్థిరమైన పెట్టుబడుల ద్వారా భారతీయుల సంపదను పెంచడమే మా ఆశయం" అని అంబానీ తెలిపారు.
బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్‌తో జరిగిన మీటింగ్ లో అంబానీ కీలక విషయాలను ప్రస్తావించారు. "భారతీయులు ఐదు, ఆరు దశాబ్దాలుగా నిరంతరం పొదుపు చేస్తున్నారు. కానీ ఆ పొదుపులో పెద్ద భాగం ఉత్పాదకత లేకుండా నిలిచిపోయింది" అని ఆయన వ్యాఖ్యానించారు. సంపదను దాచుకోవడంలో మనం ముందున్నా, దాన్ని పెంచుకోవడంలో వెనుకబడ్డామని స్పష్టం చేశారు.

గత ఏడాది భారతదేశం దాదాపు 60 బిలియన్ డాలర్ల బంగారం, 10 నుంచి 15 బిలియన్ డాలర్ల వెండి దిగుమతి చేసుకుందని అంబానీ గుర్తు చేశారు. ఇది పారిశ్రామిక అవసరాల కోసం కాదు... కేవలం పొదుపు కోసమేనని ఆయన అన్నారు. "ఇది వృద్ధికి దోహదపడని పొదుపు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం లేకుండా నిలిచిపోయిన సంపదకు ఇది ఉదాహరణ" అని పేర్కొన్నారు.
జియో బ్లాక్‌రాక్ రంగంలోకి..
ఈ పరిస్థితిని మార్చేందుకే జియో బ్లాక్‌రాక్ రంగంలోకి దిగుతోందని అంబానీ వివరించారు. భారతీయులు మూలధన మార్కెట్లలో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేలా నమ్మకం కల్పించడమే ఈ జాయింట్ వెంచర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సురక్షితమైన విధానాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని, ఆ రాబడి కాలక్రమేణా సంపదగా మారుతుందని ప్రజలను ఒప్పించడమే తమ ప్రయత్నమన్నారు. పొదుపు మార్గాలను పెంచడమే కాదు... ఆ పొదుపును ఆదాయంగా మార్చి, విస్తృత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే విధానమే అసలైన అవకాశం అని అంబానీ అభిప్రాయపడ్డారు. "భారతీయులు తమ డబ్బును తమ కోసం మాత్రమే కాదు, దేశ అభివృద్ధి కోసం కూడా పనిచేసేలా చేయడమే మా లక్ష్యం" అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బంగారంపై ప్రజలకున్న మోజును ఆయన 'విఘాతం'గా అభివర్ణించారు. అయితే అది అల్లకల్లోలం కాదు... సాంకేతికత ఆధారంగా ప్రతి భారతీయుడికి, ప్రతి ఇంటికి, చిన్నా పెద్ద వ్యాపారాలకు చేరువయ్యే ఆర్థిక పరివర్తన అని అంబానీ చెప్పారు. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్‌రాక్ కలిసి 50:50 భాగస్వామ్యంతో 'జియో బ్లాక్‌రాక్' అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు పలు ఆర్థిక సేవలను అందించనుంది.
అదే రిలయన్స్ నమ్మకం..
ఈ సందర్భంగా లారీ ఫింక్ తత్వశాస్త్రాన్ని ప్రశంసించిన అంబానీ, "లారీ కేవలం ఫలితాల వెనుక పరుగెత్తే సీఈఓ కాదు. సమాజ శ్రేయస్సు కోసం డబ్బు ఉపయోగపడాలన్న దృక్పథం ఆయనది. అదే రిలయన్స్ నమ్మకం కూడా" అని అన్నారు. దీనికి స్పందించిన బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్, ఆర్థిక రంగంలో నిజమైన విఘాతం వృద్ధి లక్ష్యాల వల్ల కాదు... కస్టమర్లపై దీర్ఘకాలిక దృష్టి వల్లే వస్తుందని వ్యాఖ్యానించారు. "మేము వృద్ధి లక్ష్యాలను వెంబడించం. ప్రతి రోజూ ప్రతి క్లయింట్‌తో నమ్మకంగా పనిచేయడమే మా విధానం. కాలక్రమేణా అదే విఘాతంగా మారుతుంది" అని ఫింక్ అన్నారు. బంగారం దాచే పొదుపు నుంచి, సంపదను సృష్టించే పెట్టుబడుల దిశగా భారతీయ ఆలోచనలను మళ్లించడమే జియో బ్లాక్‌రాక్ ముందున్న అసలు సవాల్‌గా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications