Hyderabad: కుప్పకూలిన రియల్ ఎస్టేట్: ఇళ్లు కొనేవారే కరువయ్యారే!
భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ గమనం ఒక్కసారిగా మందగించింది. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ఒకవైపు కొనుగోళ్లు తగ్గిపోతుంటే, మరోవైపు నిర్మించిన ఇళ్లు మాత్రం అమ్ముడుపోకుండా మిగిలిపోతున్నాయి. సాధారణంగా విక్రయాలు తగ్గితే ధరలు తగ్గుతాయని ఆశిస్తారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇళ్ల కొనుగోళ్లు తగ్గుతున్నప్పటికీ, ఇళ్ల సగటు ధర మాత్రం రూ. 2 కోట్ల మార్కును దాటడం గమనార్హం.
నాలుగేళ్లలో లేనంతగా తగ్గిన విక్రయాలు
క్రెడాయ్ హైదరాబాద్, క్రె మెట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల అమ్మకాలు ఏకంగా 13 శాతం పడిపోయాయి. గత ఆరు నెలల కాలంలో కేవలం 26,068 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2022 తర్వాత ఆరు నెలల కాలంలో ఇంత తక్కువ సంఖ్యలో ఇళ్లు విక్రయం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తగ్గిన కొనుగోళ్లు.. పెరిగిన ధరలు!
అమ్మకాలు తగ్గినా బిల్డర్లు మాత్రం ధర తగ్గించేందుకు సిద్ధంగా లేరు. గతేడాది మొదటి ఆరు నెలల్లో అమ్ముడైన ఇంటి సగటు ధర రూ. 1.85 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది అది ఏకంగా 10 శాతం పెరిగి రూ. 2.03 కోట్లకు చేరింది. అయితే విక్రయాలు మందగించినప్పటికీ, ఈ ఆరు నెలల కాలంలో మొత్తం రూ. 52,913 కోట్ల విలువైన నివాస గృహాల లావాదేవీలు జరగడం విశేషం. పీక్ స్టేజ్లో ఉన్న ప్రీమియం హౌసింగ్ విభాగంలోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
ఎన్ఆర్ఐల వెనకడుగు.. గల్ఫ్ పరిస్థితుల ప్రభావం
హైదరాబాద్ మార్కెట్కు ప్రధాన బలమైన అమెరికాలోని ఎన్ఆర్ఐల నుంచి కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనుమానాలు, వీసా నిబంధనలు కఠినతరం కావడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు కూడా కొనుగోలుదారుల ధైర్యాన్ని దెబ్బతీశాయి. స్థానిక కొనుగోలుదారులు కూడా ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
పేరుకుపోతున్న ఇళ్లు.. ఆందోళనలో బిల్డర్లు
ఒకవైపు ఇళ్ల అమ్మకాలు ఏటికేడాది క్రమంగా తగ్గుతుంటే, బిల్డర్లు మాత్రం కొత్త ప్రాజెక్టులను వేగంగా మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 49,656 కొత్త ఇళ్లు మార్కెట్లోకి వచ్చాయి. దీనివల్ల ప్రస్తుతం నగరంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఇళ్ల సంఖ్య ఏకంగా 1.42 లక్షలకు చేరుకుంది. అయితే ఇందులో వెంటనే నివాసానికి సిద్ధంగా ఉన్నవి కేవలం 20 శాతం మాత్రమే కాగా, మిగిలినవన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. రాబోయే ఆరు నెలల్లో పండుగల సీజన్ దృష్ట్యా మార్కెట్ పుంజుకుంటుందని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
