తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం సంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ రవిచంద్ర, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల నడుమ అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి, పట్టువస్త్రాలను తలపై ఉంచారు. అనంతరం సీఎం దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి లాంఛనంగా పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టమని స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవాలని, భారత్ అగ్రగామి దేశంగా తయారు కావాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మారాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంపదలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అపారమైన నమ్మకం ఉందని సీఎం పేర్కొన్నారు.
దేశ, విదేశాల్లోని భక్తులు ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారని అన్నారు. స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ పాలకమండలిని అధికారులకు సూచించారు. తిరుమలలో క్రమశిక్షణతో కూడిన ఆలయ నిర్వహణ దేశంలోని ఇతర ఆలయాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రీవారి ఆలయాన్ని చక్కగా నిర్వహిస్తున్న పాలకమండలి, అధికారులను అభినందించారు. ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించేలా అందరూ పనిచేయాలని కోరారు.
పెద్ద శేషవాహనంపై శ్రీమలయప్ప స్వామి దర్శనం
సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలిరోజు తిరుమాడ వీధుల్లో పెద్ద శేషవాహనంపై కొలువు దీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. సీఎం సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు.

శ్రీవారి ఆలయంలో టీటీడీ రూపొందించిన శ్రీవారి క్యాలెండర్, డైరీ సహా వివిధ ప్రచురణలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి తిరుమలలోని గాయత్రి భవనంలో బస చేయనున్నారు. సెప్టెంబర్ 16, బుధవారం రెండో రోజు పర్యటనలో భాగంగా తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లో నూతనంగా ఏర్పాటు చేసిన పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్ అలాగే భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications
