పాకిస్థాన్ కు ఇలాంటి జిమ్మిక్కులు అలవాటే: ఇచ్చిపడేసిన భారత్
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత, ప్రపంచ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ పై ఇప్పటికే ఉన్న రివార్డును పెంచుతూ పాకిస్థాన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మసూద్ అజర్ పై ఉన్న రివార్డును పీకేఆర్ 50 లక్షల నుంచి మరో 20 లక్షలు పెంచి పీకేఆర్ 70 లక్షలకు చేర్చింది. అయితే పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై తాజాగా భారత్ తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ పాకిస్థాన్ జిమ్మిక్కులని అభివర్ణించింది. ప్రపంచం దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ ఇలాంటివి చేస్తూనే ఉంటుందని మండిపడింది. ఇలాంటి జిమ్మిక్కులు పక్కనపెట్టి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఇస్లామాబాద్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలోనూ ఇలాంటి జిమ్మిక్కులు చాలానే పాకిస్థాన్ చేసిందని దుయ్యబట్టారు. ఈ మేరకు మసూద్ అజర్ పై పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
"పాకిస్థాన్ తక్షణమే ఇలాంటి బూటకపు ప్రచారాలను పక్కన పెట్టాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఎంత అర్థరహితమో మనకు తెలుసు. ఉగ్రవాదం విషయంపై పాకిస్థాన్ ఊరికే నోటి మాటలు కాకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఇలాంటి రివార్డు పెంపు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇక మసూద్ అజర్ కు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని భారత్ ఏళ్ల నుంచి చెబుతూ వస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం అతను అఫ్గానిస్తాన్ పారిపోయాడని ఇక్కడ లేడని వాదిస్తోంది. అయితే అటు అఫ్గానిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఇదే విషయంపై స్పందిస్తూ.. మసూద్ అజర్ అఫ్గానిస్తాన్ లో లేడని కుండ బద్దలు కొట్టింది.

ఇక ఇంటర్నేషనల్ టెర్రరిస్టు మసూద్ అజర్ పై పాకిస్థాన్ ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం ఉగ్రవాదం అంశంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటుంది. అలాగే వచ్చే అక్టోబర్ నెలలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ లిస్టులో పాకిస్థాన్ 2018 నుంచి 2022 వరకు గ్రే లిస్టులో ఉంది. ఆ తర్వాత గ్రే లిస్టు నుంచి బయటకు వచ్చింది. కానీ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులు పాకిస్థాన్ లోనే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న తరుణంలో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications
