దేశంలో ఉద్యోగ సంక్షోభం.. ఫ్రెషర్స్ పరిస్థితి దారుణం
ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివారు అంటే ఉద్యోగం పక్కా వస్తుంది. ఐదు అంకెల జీతం వస్తుంది అని భావించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకున్నా ఉద్యోగం దొరుకుతుంది అన్న నమ్మకం ఇప్పుడు లేకుండా పోయింది. తాజా నివేదిక ప్రకారం దేశంలో ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారి సంఖ్య అందుబాటులో ఉన్న ఖాళీల కంటే చాలా ఎక్కువగా ఉంది. చదువుకుంటున్న వారు పెరగగా, అంతే స్థాయిలో ఉద్యోగాలు పెరగలేదు. ఫలితంగా ప్రతీ సంవత్సరం గ్రాడ్యుయేట్స్ అయిన వారు ఉద్యోగాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
2026 ఆగస్టు నాటికి దాదాపు 39.59 లక్షల మంది యాక్టివ్ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉండగా, ఉద్యోగాలు కేవలం 6.68 లక్షల మందికి మాత్రమే వచ్చాయి. సగటున ఒక్క ఉద్యోగానికి దాదాపు 5.9 మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా 0 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు మొత్తం అభ్యర్థుల్లో 45 శాతం ఉన్నా, వారికి దక్కుతున్న ఉద్యోగాలు 28 శాతం మాత్రమే. ఫ్రెషర్లకు మొదటి ఉద్యోగం సంపాదించడమే చాలా పెద్ద సవాలుగా మారింది.

అనుభవం పెరిగేకొద్దీ పరిస్థితి కొంత మెరుగవుతోంది. 4 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి 54 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. 15 ఏళ్లు పైబడినవారిలో ఒక్క ఉద్యోగానికి 4.1 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఐటీ రంగం మాత్రమే కాదు. మొత్తం ఇంజినీరింగ్ ఉద్యోగాల్లో ఐటీ, సాఫ్ట్‌వేర్ వాటా 33 శాతం మాత్రమే. మిగతా 67 శాతం తయారీ, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఆటోమోటివ్, ఈవీ, ఎనర్జీ వంటి రంగాల్లో ఉన్నాయి.
ఈ రంగాలలో కూడా పరిస్థితి అలాగే ఉంది. అయితే దేశంలో బెంగళూరు 19 శాతం ఉద్యోగాలతో ముందుంది. హైదరాబాద్ 12 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. డిగ్రీ మాత్రమే చాలదు. నైపుణ్యాలు, అనుభవం, కొత్త రంగాల్లో నేర్చుకునే సామర్థ్యం ఉంటేనే ఉద్యోగం సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనా గతానికి భిన్నంగా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఉద్యోగాల కోసం పడరాని పాట్లు పడటం కాస్త యువ ఇంజనీర్ల భవిష్యత్ పై ఆందోళన కలిగిస్తుంది.













Click it and Unblock the Notifications
