కేబీఆర్ పార్కు ప్రాజెక్టు రద్దు.. రూ.1,090 కోట్లు మిగిల్చిన చిన్న ప్లాన్!
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీని నియంత్రించటం కోసం జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో ముఖ్యంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు ప్రధాన కూడళ్లలో నిర్మించాలని స్టీల్ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌లను నిర్మించాలని భావించింది. అయితే దీనికోసం భారీ బడ్జెట్ ను కూడా కేటాయించింది.
మొత్తం రూ.1,090కోట్లతో నిర్మించాలని భావించిన ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. జీహెచ్‌ఎంసీ ఈ పనులను పూర్తిగా రద్దు చేసింది. ఒక చిన్న ప్లాన్ ఈ భారీ ప్రాజెక్ట్ అవసరమే లేకుండా చేసింది.. వన్‌వే ట్రాఫిక్ విధానం అమలు చేసిన తర్వాత కేబీఆర్ పార్క్ దగ్గర రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. నెల రోజుల క్రితం ప్రారంభమైన వన్‌వే ప్లాన్ మొదట్లో వాహనదారులకు కొంత ఇబ్బంది కలిగించినా, రెండు-మూడు రోజుల్లోనే పరిస్థితి మెరుగైంది.

వన్ వె ట్రాఫిక్ విధానం తీసుకువచ్చిన తర్వాత ప్రధాన సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. దీంతో భారీ నిర్మాణాలు చేపట్టకుండానే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు నిర్ణయానికి వచ్చారు. జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు గేట్, ముగ్ధా జంక్షన్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పరిసరాల్లో ప్రతిపాదించిన పనులన్నీ రద్దయ్యాయి.
కేఎన్ఆర్, మేఘా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేశారు. శనివారం జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. అయితే ఇక్కడే ఆగలేదు. పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల పైవంతెన ద్వారా సిగ్నల్ ఆధారిత ట్రాఫిక్‌ను తగ్గించి, నిరంతర వాహనాల రాకపోకలకు వీలు కల్పించాలని లక్ష్యంగా ఈ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. ఏది ఏమైనా ఒక చిన్న వన్‌వే ప్లాన్ వెయ్యి కోట్లకు పైగా నిధులు వృధా కాకుండా కాపాడింది. అదే సమయంలో మరింత సమర్థవంతమైన కొత్త కారిడార్‌కు మార్గం సుగమమైంది.













Click it and Unblock the Notifications
