"అడ్డుకునే ముసుగులో అసభ్యంగా"..! ఢిల్లీ పోలీసులపై మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు..!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆందోళనలు చేస్తున్న విపక్షాలు, విద్యార్ధి సంఘాల్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ ఆందోళనల్ని కవర్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళా జర్నలిస్టుల్ని (Women Journalists) ఢిల్లీ పోలీసులు అసభ్యంగా తాకారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే ఢిల్లీలో గతంలో విద్యార్ధుల నిరసనల్ని అడ్డుకునేందుకు వారిపై దాడులు చేసిన చరిత్ర ఉన్న ఢిల్లీ పోలీసులు.. ఇప్పుడు ఏకంగా మహిళా జర్నలిస్టులపై లైంగిక దాడుల (Sexual Assault) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు ఈ కేసుల్ని క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు.
జంతర్ మంతర్ వద్ద నిన్న ఆందోళనల సందర్భంగా ముగ్గురు మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు తీవ్ర తాత్సారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే మహిళలపై చేతులు ఎత్తడం దారుణమన్నారు. ఢిల్లీ పోలీస్ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని గుర్తుచేస్తూ, అమిత్ షా గారూ, మీరెక్కడ ఉన్నారు? ఈ దారుణ ఘటనపై మీరే సమాధానం చెప్పాలని సూచించారు. కనీసం ఫిర్యాదును కూడా నమోదు చేయలేని ప్రభుత్వం దేన్ని రక్షిస్తోందని నిలదీశారు.

అటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారి వివేక్ భగత్ ఒక మహిళా జర్నలిస్టుతో అత్యంత అసభ్యంగా ప్రవర్తించారని, బాధిత జర్నలిస్ట్ ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే స్థానిక పోలీస్ అధికారులు తిరస్కరించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరపాలని కోరింది. మరోవైపు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) కూడా పోలీసుల తీరును తప్పుపట్టింది. పురుష పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా మహిళా నిరసనకారులు, జర్నలిస్టులతో దురుసుగా వ్యవహరించారని మండిపడింది. రక్షణ కల్పించాల్సిన పోలీస్ బలగాలే ఇలాంటి వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. బాధితులు ఫిర్యాదు చేసినా రాత్రి వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జర్నలిస్టులు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. దీనిపై ఢిల్లీ పోలీస్ విభాగం స్పందిస్తూ, మహిళా జర్నలిస్టుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిష్పక్షపాత విచారణ కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు ప్రకటించింది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు నిరసన ఆపబోమని ఆందోళనకారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
