త్వరగా పెళ్లి చేసుకోని.. ఐదుగురు పిల్లల్ని కనండి!
యువత వివాహ వయస్సు, కుటుంబ నియంత్రణపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సమాజంలో మారుతున్న జనాభా గణాంకాలను దృష్టిలో ఉంచుకుని సనాతన ధర్మ ప్రచారకులు, యువత త్వరితగతిన వివాహాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ దంపతులు కనీసం ఐదుగురు పిల్లలకు జన్మనివ్వాలని, అప్పుడే సమాజంలో జనాభా సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని బార్వానీలో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు సమాజంలో వివాహ వ్యవస్థ, కుటుంబ పరిమాణం చాలా భిన్నంగా ఉండేదని ఎంపీ గుర్తుచేశారు. గతంలో 20 నుంచి 22 ఏళ్ల వయస్సులోనే పెళ్లిళ్లు చేసుకుని ఐదు నుంచి ఏడుగురు పిల్లలను కనేవారని, కానీ నేటి యువత 30 నుంచి 35 ఏళ్లు వచ్చినా పెళ్లిళ్లకు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఒకే బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని, దీనివల్ల ఒక వర్గం జనాభా వృద్ధి రేటు గణనీయంగా పడిపోతోందని చెప్పారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే యువత త్వరితగతిన వివాహ బంధంలోకి అడుగుపెట్టి, కనీసం ఐదుగురు సంతానాన్ని పొందాలని ఉద్ఘాటించారు.

'డీజే, డ్రగ్స్, డౌరీ'పై సమరం: ఎంపీ '3D' ఫార్ములా
తన ప్రసంగంలో సమాజంలో పెరిగిపోతున్న దురాచారాలపై ఎంపీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డీజే సంస్కృతి, డ్రగ్స్ వాడకం, వరకట్నం అనే మూడు ప్రధాన సమస్యలను తుడిచిపెట్టేందుకు '3D' ప్రచారాన్ని చేపట్టినట్లు తెలిపారు. నేటి యువత ప్రదర్శన బుద్ధికి, వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఊరేగింపుల్లో డీజేల హోరుకు నృత్యాలు చేసే యువతలో దాదాపు 60 శాతం మంది వివిధ రకాల మత్తు పదార్థాల ప్రభావంలో ఉంటున్నారని, ఇది సమాజ భవిష్యత్తుకు ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు.
భక్తితో పాటు శక్తి కూడా అవసరమే!
యువత కేవలం ఆధ్యాత్మిక భావనలకే పరిమితం కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జిమ్‌లు, సాంప్రదాయ కుస్తీలను తిరిగి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆపదలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ రాజకీయ పార్టీలపై ఆధారపడకుండా, సమాజంలోని ప్రజలే ఒకరికొకరు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. దైవభక్తితో పాటు దేహదార్ఢ్యం, ఆత్మరక్షణకు అవసరమైన సామర్థ్యం పెంపొందించుకోవడమే ప్రస్తుత కాలపు అవసరమని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
