జ్ఞానేష్ కుమార్ పాతకేసు రీ ఓపెన్: తిరగదోడుతున్న రాష్ట్ర హోమ్ శాఖ
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఓ పాత వివాదం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ గతంలో కేరళ ప్రభుత్వంలో పని చేసినప్పుడు చోటు చేసుకున్న అక్రమాలను వెలుగులోకి రానున్నాయి. వాటన్నింటినీ కూడా తవ్వి తీస్తోందక్కడి ప్రభుత్వం. దీనిపై కేరళం విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో రంగంలోకి దిగింది. 2006లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించిన కాలానికి సంబంధించినవి అవి.
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు రీఓపెన్ కానుంది. జ్ఞానేష్ కుమార్ హయాంలో కేరళ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ పరిధిలో ఎంసీ రోడ్డు ఆధునీకరణ పనుల కాంట్రాక్ట్ తీసుకున్న మలేషియాకు చెందిన సివిల్ ఇంజినీర్ లీ సీ బీన్ అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకోవడం.. ఈ వివాదానికి కేంద్రబిందువు అయింది. ఈ రోడ్డు నిర్మాణ పనుల బాధ్యతను పీఏటీఐ బీఈఎల్ అనే అంతర్జాతీయ కన్సార్టియం చేపట్టింది.

ఈ కన్సార్టియంలో కీలక బాధ్యతల్లో పనిచేశారు బీన్. 2006లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. జ్ఞానేష్ కుమార్ పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈ ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో కేరళ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. బీన్ రాసిన ఆత్మహత్య లేఖలో జ్ఞానేష్ కుమార్ పేరు స్పష్టంగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2006లో విచారణ సైతం నిర్వహించింది కేరళం వీసీఏబీ. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆ తర్వాత ఆ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఆ వెంటనే జ్ఞానేష్ కుమార్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. డెప్యుటేషన్ పై రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు ఫైళ్లు మూలన పడ్డాయి. ఇప్పుడు అదే కేసును తిరగదోడాలని కేరళం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి రమేష్ చెన్నితల ఆదేశాలు ఇచ్చారు. పీడబ్ల్యూడీ కార్యదర్శిగా జ్ఞానేష్ కుమార్ పని చేసినప్పుడు ఆ శాఖలో చోటు చేసుకున్న అవకతవకలన్నింటినీ వెలికి తీయాలని ఆదేశించారు.
దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను గడువులోగా హోం మంత్రిత్వ శాఖకు అప్పగించాలని అన్నారు. జ్ఞానేష్ కుమార్ హయాంలో పీడబ్ల్యూడీ శాఖ ఉన్నతాధికారుల వేధింపుల వల్లే బీన్.. బలవన్మరణానికి పాల్పడ్డాడనేది కేరళం కాంగ్రెస్ వాదన. దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఇప్పుడు సేకరించడం మొదలుపెట్టింది. వాటన్నింటి ఆధారంగా వేణుగోపాల్ తాజాగా జ్ఞానేష్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ దర్యాప్తు ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని విపక్షాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications
