బ్యాంకులకు వరుసగా 5 రోజులు క్లోజ్- 26 నుంచి
ఈ నెల చివరి వారంలో వరుసగా అయిదు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. వాటి కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోనున్నాయి. డిజిటల్ సర్వీసులు మినహా రోజువారీగా అన్ని రకాల లావాదేవీలకు పూర్తిగా పుల్ స్టాప్ పడబోతోంది. ఈ నెల 25వ తేదీ.. బ్యాంకులకు చివరి వర్కింగ్ డే కానుంది. ఆ తర్వాత మళ్లీ తెరచుకునేది అక్టోబర్ 1వ తేదీ నాడే. నెల చివరివారం కావడం వల్ల ఖాతాదారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
దీనికి కారణాలు లేకపోలేదు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ సమ్మె మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా సమ్మెలో పాల్గొంటారు. విధులకు హాజరు కాబోరు. వారంలో అయిదు రోజుల పని దినాలను కల్పించడంతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలనేది వారి ప్రధాన వాదన.

28వ తేదీ సోమవారం సమ్మె ఆరంభమౌతుంది. దీనికి ముందు వచ్చే 26, 27 తేదీల్లో బ్యాంకులు పని చేయవు. 26న రెండో శనివారం, 27న ఆదివారం కావడం వల్ల బ్యాంకులు తెరచుకోవు. 28, 29, 30 తేదీల్లో ఉద్యోగులందరూ సమ్మెలోకి వెళ్తారు. అంటే సోమ, మంగళ, బుధవారాల్లో కూడా బ్యాంకులు మూతపడే ఉంటాయి. ఫలితంగా 26 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకులు బంద్ అయినట్టవుతుంది. అక్టోబర్ 1వ తేదీన బ్యాంకులు తెరచుకుంటాయి.. గానీ ఆ మరుసటి రోజు గాంధీ జయంతి కావడం వల్ల మళ్లీ మూతపడతాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ అడ్వైజరీ ఇచ్చింది. వరుసగా అయిదు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున అత్యవసరమైన లావాదేవీలన్నింటినీ కూడా ముందుగానే పూర్తి చేసుకోవాలని ఖాతాదారులను కోరింది. ఈ అయిదు రోజుల సుదీర్ఘ విరామం వల్ల అనేక ఆర్థిక కార్యకలాపాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పన్ను చెల్లింపులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లుల గడువు తేదీలు ఈ వ్యవధిలో ఉంటే గనుక ఖాతాదారులపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది.
ఈ కారణాల వల్ల ఎస్‌బీఐ అడ్వైజరీ ఇచ్చింది. వరుస సెలవులు, సమ్మె వల్ల ఖాతాదారులకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి డిజిటల్ లావాదేవీలను వినియోగించుకోవాలని ఎస్బీఐ సూచించింది. బ్యాంకు సమ్మె రోజుల్లో కూడా కస్టమర్ సర్వీస్ పాయింట్లు, వివిధ బ్యాంకింగ్ డిజిటల్ ఛానల్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.
— State Bank of India (@TheOfficialSBI) September 19, 2026
ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవలు, యోనో, మొబైల్ అప్లికేషన్, యూపీఐ వంటి ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని వివరించింది. సమ్మె కాలంలో చెక్కుల క్లియరెన్స్, అకౌంట్ల ఓపెన్, డీడీల జారీ, లోన్ల మంజూరు వంటి విభాగాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని, ముందుగానే వీటిని క్లియర్ చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది.














Click it and Unblock the Notifications
