Stock Market : కుప్పకూలిన స్టాక్ మార్కెట్ .. ఒక్క రోజులోనే రూ. 3.5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి!
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రారంభమైన కొద్ది సేపటికే మార్కెట్ నష్టాల బాట పట్టింది. ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ, స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ప్రతీకార సుంకాల భయాలు మార్కెట్‌ను ముంచెత్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు దారుణంగా నష్టపోవడంతో, మదుపర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే అమ్మకాల సునామీ మొదలైంది. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ షేర్లను అమ్మడం మొదలుపెట్టడంతో, సూచీలు క్షణాల్లో పాతాళానికి పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 23,200 మార్క్ దిగువకు చేరింది. ఈ ఒక్క రోజులోనే మదుపర్ల సంపద ఏకంగా రూ. 3.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీంతో లక్షలాది మంది ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం విలువ రూ. 409 లక్షల కోట్లకు పడిపోయింది.

సెన్సెక్స్, నిఫ్టీలు అల్లకల్లోలం!
ఉదయం మార్కెట్ తెరవగానే సెన్సెక్స్ నష్టాలతో మొదలైంది. క్రితం రోజు ముగింపుతో పోలిస్తే 76,882.58 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. తర్వాత రోజంతా నష్టాల ఊబిలోనే కొట్టుమిట్టాడింది. ఇంట్రాడేలో 75,912.18 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 1,390.41 పాయింట్ల భారీ నష్టంతో 76,024.51 వద్ద ముగిసింది. నిఫ్టీ పరిస్థితి కూడా అంతే. 353.65 పాయింట్లు నష్టపోయి 23,165 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని టాప్ 30 కంపెనీల్లో రెండే రెండు కంపెనీలు (ఇండస్‌ఇండ్ బ్యాంక్, జొమాటో) మినహా మిగిలినవన్నీ నష్టాలపాలయ్యాయి. ముఖ్యంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నేలచూపులు చూశాయి. ఈ స్టాక్స్ భారీగా పడిపోవడంతో మార్కెట్ మరింత దిగజారింది.
మార్కెట్ పతనానికి అసలు కారణాలేమిటి?
స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ప్రతీకార సుంకాలపై తుది నిర్ణయం ప్రకటిస్తారని వార్తలు రావడంతో మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా, భారతీయ వస్తువులపై కొత్త సుంకాలు విధిస్తే, భారత కంపెనీల వ్యాపారాలు దెబ్బతింటాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా ఐటీ కంపెనీలపై ఆంక్షలు విధిస్తే, భారత ఐటీ కంపెనీల ఆదాయం పడిపోతుంది. దీంతో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, ఎల్‌అండ్‌టీ వంటి పెద్ద ఐటీ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు అమ్మడం మొదలుపెట్టారు. ఫలితంగా ఈ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఐటీ రంగం నష్టపోవడంతో మార్కెట్ మొత్తం కుదేలైంది.
చమురు ధరల పెరుగుదల:
అటు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం కూడా మార్కెట్‌ను దెబ్బతీసింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75.12 డాలర్లకు చేరింది. కొద్దిరోజుల క్రితం 70 డాలర్ల వద్ద ఉన్న ధర ఒక్కసారిగా పెరగడంతో, భారత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. భారత్ చమురు దిగుమతి చేసుకునే దేశం కావడంతో, ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. ఇది ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.
లాభాల స్వీకరణ:
గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ లాభాల్లో దూసుకుపోతోంది. వరుసగా 8 సెషన్లలో 5% వరకు పెరిగింది. దీంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడానికి ఇది సరైన సమయమని భావించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీల షేర్లను అమ్మడంతో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది.
వొడాఫోన్ ఐడియా ఒక్కటే వెలుగు!
మార్కెట్ మొత్తం నష్టాల్లో కూరుకుపోయినా, వొడాఫోన్ ఐడియా షేర్లు మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఈ కంపెనీ షేర్లు ఏకంగా 20% పెరిగాయి. ప్రభుత్వానికి కొత్తగా ఈక్విటీ షేర్లను కేటాయించడంతో వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వ వాటా 22.6% నుండి 49%కి పెరిగింది. ఈ వార్తతో వొడాఫోన్ ఐడియా షేర్లను కొనడానికి ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఫలితంగా ఈ షేర్లు లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో వొడాఫోన్ ఐడియా షేర్లు 20.15% లాభంతో రూ. 8.17 వద్ద ముగిశాయి.
గమనిక : కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, బలమైన కంపెనీల షేర్లను మాత్రమే ఎంచుకోండి. కంపెనీ ఆర్థిక పరిస్థితిని, భవిష్యత్తును పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి.












Click it and Unblock the Notifications