భారీగా తగ్గనున్న చక్కెర ధరలు! పండుగ వేళ కొత్త రూల్స్
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పంచదార నిల్వలపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మార్కెట్లో చక్కెర కృత్రిమ కొరత రాకుండా, సామాన్యులకు సరసమైన ధరలకే అది అందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం.. షుగర్ డీలర్లు తమ వద్ద ఉన్న స్టాక్‌ను కేవలం 15 రోజుల్లోపు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అంటే నిల్వ ఉంచుకునే గడువును కేవలం 15 రోజులకు కుదించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో డీలర్లు గరిష్టంగా 1,000 క్వింటాళ్ల పంచదారను మాత్రమే తమ గోదాముల్లో ఉంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే అస్సాంలో మాత్రం ఈ నిబంధన నుంచి కొంత మినహాయింపు ఇచ్చారు. అక్కడ డీలర్లు గరిష్టంగా 2,000 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు.

బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్..
మార్కెట్లో కొంతమంది వ్యాపారులు ధరలు పెంచాలనే ఉద్దేశంతో చక్కెరను కృత్రిమంగా నిల్వ చేయడం, ధరల హెచ్చుతగ్గులకు పాల్పడటం వంటి పనులకు తెరలేపుతుంటారు. వీటికి అడ్డుకట్ట వేయడమే కేంద్రం ప్రధాన ఉద్దేశం. అలాగే మిల్లుల నుంచి వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సరుకు సరఫరా జరిగేలా ఈ తాజా నిబంధనలు దోహదపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తగ్గిన రిటైల్, మిల్లుల ధరలు..
గత ఆగస్టు నెలతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో పంచదార ధరలు దాదాపు 15 శాతం వరకు తగ్గాయి. ఇక మిల్లుల వద్ద కూడా ధరలు సుమారు 28 శాతం వరకు పడిపోయి గత మూడు వారాలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రయోజనాన్ని హోల్‌సేలర్లు, రిటైలర్లు వెంటనే సామాన్యులకు అందించాలని, ధరల తగ్గింపు ఫలాలు వినియోగదారులకు చేరేలా చూడాలని కేంద్రం గట్టిగా కోరింది.
చెరుకు క్రషింగ్ షురూ.. రైతులకు భరోసా
కొత్త షుగర్ క్రషింగ్ సీజన్ అక్టోబర్ 1 నుంచే ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను బట్టి వెంటనే క్రషింగ్ పనులను మొదలుపెట్టాలని షుగర్ మిల్లులకు కేంద్రం సూచించింది. ఏరియాలోని పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది. ఏదేమైనా.. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడటం, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూస్కోవడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
