గాల్లో ఎగిరే కారు.. రూ. 2.37 కోట్లు కేవలం బుకింగ్ కోసమే!
ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఇటీవల ఆవిష్కరించిన కొత్త 'రోడ్‌స్టర్' ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. టెక్సాస్‌లోని స్పేస్ ఎక్స్ పరీక్షా ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యక్ష ఈవెంట్లో ఈ కారుకు అమర్చిన ప్రత్యేక 'స్పేస్ ఎక్స్ కోల్డ్-గ్యాస్ రాకెట్ థ్రస్టర్ల' సాయంతో గాల్లోకి లేవడం, విన్యాసాలు చేయడం చూసి ప్రపంచం మైమరచిపోయింది. అయితే గాల్లోకి ఎగిరే ఈ కారు నిజంగానే సాధారణ రోడ్లపై నడపడానికి వీలవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
గాల్లోకి ఎగిరే విన్యాసాలు
టెస్లా ప్రదర్శించిన కొత్త రోడ్‌స్టర్ ప్రోటోటైప్‌లో ఫైటర్ జెట్ తరహా డిజైన్, స్పెషల్ రాకెట్ థ్రస్టర్లు, అండర్ బాడీ సక్షన్ ఫ్యాన్ అమర్చగా.. దీని సాయంతో గాల్లోకి లేచి రోల్స్ చేయడం, విన్యాసాలు ప్రదర్శించడం వంటివి ప్రత్యక్షంగా చూపించారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఇప్పటివరకు ఏ దేశంలోనూ రాకెట్ థ్రస్టర్లు ఉన్న లేదా గాల్లోకి ఎగిరే వాహనాలు సాధారణ రోడ్లపై తిరిగేందుకు అనుమతించే చట్టపరమైన నిబంధనలు లేవు. ఈ వాహనం కేవలం ప్రైవేట్ ట్రాక్స్ లేదా నిపుణుల సమక్షంలో ప్రదర్శనలకే పరిమితమయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కేవలం బుకింగ్‌కే రూ.2.37 కోట్లు
టెస్లా ఇప్పటికే ఈ మోడల్ కు సంబంధించి అధికారిక బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ కారు పెర్ఫార్మెన్స్, థ్రస్ట్, రాకెట్ అనే మూడు వేరియంట్లలో లభించనుంది. బుకింగ్ కోసం మొదట 5 వేల డాలర్లు, తదుపరి 10 రోజుల్లో మరో 2, 45,00 డాలర్లు చెల్లించాలి. అంటే కేవలం బుకింగ్ కోసమే మొత్తం 2,50,000 డాలర్లు(దాదాపు రూ.2.37 కోట్లు) వెచ్చించాలి. మరోవైపు టాప్ వేరియంట్‌పై టెస్లా ఇప్పటికే స్పష్టతను ఇచ్చింది. గాల్లో విన్యాసాలు చేసే టాప్ మోడల్ 'రాకెట్ వేరియంట్' సాధారణ రోడ్లపై నడపడానికి వీలులేదని టెస్లా స్వయంగా తన నిబంధనలలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ రూ.2.37 కోట్లు అనేది కేవలం బుకింగ్ అమౌంట్ మాత్రమేనని, కారు పూర్తి ధర ఎంతో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
2017 నుంచి వాయిదాల పర్వం.. 2028లో ఉత్పత్తి సాధ్యమేనా?
టెస్లా రోడ్‌స్టర్ చరిత్రను గమనిస్తే.. 2017లోనే ఎలన్ మస్క్ ఈ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించారు. 2020 నాటికే దీని ఉత్పత్తి మొదలవుతుందని నాడు నమ్మబలికి.. వేలాది మంది నుంచి దాదాపు రూ.50 వేల డాలర్ల చొప్పున బుకింగ్ అడ్వాన్సులు వసూలు చేశారు. కానీ తొమ్మిదేళ్లు గడిచినా నాటి కాన్సెప్ట్ కారు అసలు ఉత్పత్తి దశకే నోచుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఫ్లయింగ్ ఫీచర్లలో మళ్లీ షోకాస్ చేస్తూ.. 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని టెస్లా ప్రకటిస్తోంది. అయినప్పటికీ.. కస్టమర్లకు డెలివరీలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని టెస్లా నిబంధనల్లో స్పష్టం చేయడం గమనార్హం.














Click it and Unblock the Notifications
