మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు!
హైదరాబాద్ నగరానికి కొత్త రూపు ఇచ్చే మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా అంతర్జాతీయ స్థాయిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఈ టెండర్లు ఆహ్వానించబడ్డాయి. రెండు ప్యాకేజీల కలిపి అంచనా వ్యయం రూ.7,345.12 కోట్లు. ఇందులో భూసేకరణ ఖర్చు చేర్చబడలేదు.
ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం మూసీ నదిని శుభ్రం చేయడం, వరదలను నియంత్రించడం, ఇరువైపులా రిటైనింగ్ వాల్స్, రోడ్లు, వంతెనలు, మురుగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేయడం. పనులు ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ లేదా డిజైన్ అండ్ బిల్డ్ పద్ధతిలో జరుగుతాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతను కూడా ఎంపికైన సంస్థ నిర్వహించాలి.

జోన్-1ఏ పరిధిలో హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సుమారు 7.53 కిలోమీటర్లు పనులు జరుగుతాయి. దీనికి అంచనా వ్యయం రూ.3,232.01 కోట్లు. హిమాయత్‌సాగర్ డ్యామ్ భద్రతా నిబంధనల కారణంగా తొలుత ప్రతిపాదించిన 9.20కిలోమీటర్ల నుంచి పరిధి కొంత తగ్గింది. ఇక్కడ నదిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు, ప్రవాహం క్రమబద్ధీకరణ, రిటైనింగ్ వాల్స్, కరకట్టలు, రహదారులు, వంతెనలు, యుటిలిటీ కారిడార్లు, వరదనీటి కాలువలు, ప్రధాన మురుగునీటి పైప్లైన్లు, రబ్బర్ డ్యామ్‌లు నిర్మిస్తారు.
జోన్-1బీలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.52కిలోమీటర్లు పనులు జరుగుతాయి. అంచనా వ్యయం రూ.4,113.11కోట్లు. ఇక్కడ కూడా నదీ ప్రక్షాళన, వరద నియంత్రణ, రిటైనింగ్ వాల్స్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, సీవర్ పైప్లైన్లు ఏర్పాటు చేస్తారు. రెండు జోన్లు కలిపి సుమారు 19.05కిలోమీటర్ల మేర అభివృద్ధి జరుగుతుంది. గతంలో ప్రకటించిన ఫేజ్-1లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల లక్ష్యం ఉండగా, ప్రస్తుతం టెండర్లో చేర్చిన పరిధి కొంత తగ్గింది.
రెండు కీలక వంతెనలు కూడా భాగంగా ఉన్నాయి. జోన్-1ఏలో ఔటర్ రింగ్ రోడ్డు రాజేంద్రనగర్ టోల్ ప్లాజా సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తారు. జోన్-1బీలో నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓఆర్ఆర్పై ఐకానిక్ కేబుల్-స్టేయిడ్ వంతెన నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న లోలెవల్ వంతెనను తొలగించి కొత్తది ఏర్పాటు చేస్తారు. ఇవి వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం లేకుండా సహాయపడతాయి.
నిధుల విషయంలో ఏడీబీ నుంచి రూ.4,500 కోట్ల రుణం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2,845.12 కోట్లు అందుతాయి. మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్ల మేర సాగే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్‌ను లండన్ థేమ్స్ లాంటి రివర్‌ఫ్రంట్ నగరంగా మార్చే దిశగా ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు. టెండర్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15 నుంచి పత్రాలు డౌన్లోడ్ అవుతున్నాయి. అక్టోబర్ 29న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు.
నవంబర్ 26 సాయంత్రం 5 గంటలలోపు బిడ్లు సమర్పించాలి. నవంబర్ 27న సాంకేతిక బిడ్లు తెరుస్తారు. అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సాంకేతిక, ఆర్థిక అర్హతల ఆధారంగా సంస్థను ఎంపిక చేస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నది ఎగువ ప్రాంతంలో వరద నిర్వహణ మెరుగుపడుతుంది.
పరీవాహక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. హైదరాబాద్ నగర ప్రజలకు శుభ్రమైననది, అందమైన రివర్‌ఫ్రంట్, మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయి. ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ, పునరావాస చర్యలపై కూడా దృష్టి సారించింది. మూసీ నది మళ్లీ జీవం పోసుకుని నగరానికి కొత్త ఆకర్షణగా మారే దిశగా ఈ టెండర్లు ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు.













Click it and Unblock the Notifications
