ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత... అపోలో ఆసుపత్రికి తరలింపు
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో పాటు వయసురీత్యా తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రఖ్యాత ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు కావడంతో, కుటుంబ సభ్యులు మరియు పార్టీ వర్గాలు వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.
శుక్రవారం రాత్రి దాదాపు 7:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకున్న అద్వానీని వైద్యులు పల్మనరీ విభాగానికి తరలించారు. ప్రస్తుతం ఆయన అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించడంతో శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు.

గత కొద్ది కాలంగా తరచూ ఆసుపత్రి పాలు..
98 ఏళ్ల అద్వానీ వయసురీత్యా తలెత్తే అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా తరచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కూడా ఆయన అనారోగ్యం కారణంగా ఇదే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుని ఇంటికి వెళ్లారు. అంతకుముందు 2024 సంవత్సరంలో కూడా వివిధ అనారోగ్య సమస్యలరీత్యా ఆయన పలుమార్లు ఢిల్లీలోని ఎయిమ్స్, అపోలో ఆసుపత్రులలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. 2024 డిసెంబర్లో కూడా ఆయనకు ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం అందించారు.
భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నేత
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నేతలలో ఎల్కే. అద్వానీ పాత్ర అత్యంత కీలకం. దేశ రాజకీయాల్లో తనదైన శైలితో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన, 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 మార్చిలో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న'తో సత్కరించింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.














Click it and Unblock the Notifications
