‘మోదీ కేర్’పై అస్పష్టత.. ఒబామా కేర్‌తో పొంతనే లేదు
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 40 శాతం ఆరోగ్య భద్రత ఛత్రఛాయలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో ప్రకటించిన భారీ పథకం 'మోదీ కేర్'. ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో చేపడుతున్న అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం జాతీయ ఆరోగ్యభద్రతా పథకం అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో అభివర్ణించారు. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ, 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తుందని చెబుతున్నా, పథకం ఆచరణపై అనుమానాలు మాత్రం తొలగడం లేదు. విధి విధానాలపై స్పష్టత లేకపోవడం, అవసరమైన రూ.11వేల కోట్ల నిధులు ఎలా సర్దుబాటు చేస్తారో తెలుపకపోవడమే అందుకు కారణం.
సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఆగమేఘాలపై పథకాన్ని ప్రకటించారే తప్ప, కనీస కసరత్తు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంచంపట్టిన దేశీయ ఆరోగ్యరంగానికి 'మోదీ కేర్' కాయకల్ప చికిత్స చేస్తుందా? లేక ఆచరణలో విఫలమైన మరో ఆరోగ్య కార్యక్రమంగా నిలిచిపోతుందా? అన్న సందేహాలు ఉన్నా.. ఇప్పటికీ దేశంలో ప్రభుత్వ రంగంలో ఆరోగ్య సేవలు పటిష్టంగా ఉన్న దాఖలాలు లేవు.

జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకానికి రూ.11 వేల కోట్లు?
‘మోదీ కేర్'గా పిలుస్తున్న ఈ పథకంపై కేంద్రం భారీగా ఆశలు పెట్టుకుంది. రెండేళ్ల క్రితం 2016 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఏటా రూ. లక్ష ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించగా, ఇప్పటివరకు అది అమలుకు నోచుకోలేదు. అది కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందడానికే ఏడాదికి పైగా సమయం పట్టింది. ‘మోదీ కేర్'గా చెప్పుకుంటున్న పథకానికి ఏటా రూ.11వేల కోట్లు ఖర్చు అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఆరువేల నుంచి ఏడువేల కోట్లు కేంద్రం వాటాగా, మిగతా మొత్తం రాష్ర్టాలు భరించేలా రూపొందించాలని భావిస్తున్నారు. ఆ నిధులు ఎక్కడినుంచి తెస్తారన్న దానిపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ఈ పథకంపై కేంద్రమంత్రులు తలోరకంగా మాట్లాడుతుండటం చూస్తే, దాని విధి విధానాలపై ప్రభుత్వ పెద్దలకే స్పష్టత లేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘మోదీ కేర్' ఆచరణ అసాధ్యం అని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

సంతృప్తికరంగా లేని ఆరోగ్య బీమా పథకాల అమలు తీరు
ఇప్పటికే ఆరడజనుకు పైగా ఆరోగ్య బీమా పథకాలను కేంద్రం అమలు చేస్తున్నది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీం (ఈఎస్‌ఐఎస్), కేంద్ర ప్రభుత్వ హెల్త్‌స్కీం (సీజీహెచ్‌ఎస్), ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై), జనశ్రీ బీమా యోజన (జేబీవై), యూనివర్సిల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం (యూహెచ్‌ఐఎస్) అమల్లో ఉన్నాయి. అయినా ప్రజలకు ఆరోగ్యబీమా కవరేజీ సంతృప్తికరంగా లేదని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-4) నివేదిక స్పష్టంచేసింది. దేశంలోని 29శాతం కుటుంబాల్లో కనీసంగా ఒక్కరు మాత్రమే ఆరోగ్యబీమా కలిగి ఉన్నారని, దేశంలోని 15-49 ఏండ్ల వయసున్నవారిలో 20శాతం మహిళలు, 23శాతం పురుషులు మాత్రమే ఆరోగ్యబీమా పరిధిలోకి వస్తున్నారని సర్వే తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన.. సమర్థవంతమైన ఆరోగ్య పథకాలైనా, అవి ఆచరణలో విఫలమైనట్లు ఆరోగ్య సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

విద్యా, ఆరోగ్య సెస్ నుంచి నిధుల మళ్లింపు ఇలా
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకానికి ఈసారి బడ్జెట్‌లో కేటాయించిన రూ.2వేల కోట్లను మోదీకేర్‌కు మళ్లించనున్నారు. ప్రతీ పేద కుటుంబానికి ఏటా రూ.ఐదు లక్షల వరకు ఆరోగ్యరక్షణ కల్పించాలంటే ఈ సొమ్ము సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడుశాతం విధిస్తున్న విద్యాసెస్‌ను విద్యా ఆరోగ్య సెస్‌గా మార్చి ఇప్పుడు 4 శాతంగా పెంచనున్నామని, ఈ సెస్ కింద అదనంగా రూ.11వేల కోట్లు వస్తాయని ఆర్థికమంత్రి తెలిపారు. వాటిని మోదీకేర్ స్కీమ్‌కు మళ్లించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వ పూర్తిస్థాయి చివరి బడ్జెట్ కావడంతో ఆగమేఘాలపై ప్రకటన అయితే చేశారుకానీ.. నిధులు, విధివిధానాలపై స్పష్టత లేదని తెలుస్తున్నది. ‘క్రితం బడ్జెట్'లో ఆరోగ్యశాఖకు రూ.47,353 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.52,800 కోట్లు కేటాయించారు. మోదీకేర్ వంటి ఆరోగ్య రక్షణ పథకం చెప్పుకోవడానికి భారీగానే కనిపిస్తున్నదే కానీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తే చేయలేదని మంత్రి జైట్లీ చేసిన కేటాయింపులు చెబుతున్నాయి. ఆచరణలోకి తేవడానికి అవసరమైన చర్యలు తీసుకోలేదని పాపులేషన్ ఫౌండేషన్ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనం ముత్రేజా వ్యాఖ్యానించారు.

త్వరిగతిన ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకే సర్కార్ మొగ్గు
అత్యంత ఖరీదైన వైద్య సేవలను సైతం పేద ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘ఆయుష్మాన్ భారత్' పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం పకడ్బందీ కార్యాచరణకు అవసరమైన కసరత్తును జులైకల్లా పూర్తిచేయాలని భావిస్తోంది. అనుకున్నవిధంగా అన్ని ఏర్పాట్లు పూర్తయితే వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15)నాడు పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికి సాధ్యం కాకపోతే జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబరు 2 నుంచి అమలులోకి వస్తుంది.

అత్యవసర పరీక్షలూ అందని ద్రాక్షేనా
వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర చికిత్సలు నిరుపేదలకు అందని ద్రాక్ష పండే అవుతోంది. మధ్య తరగతి ప్రజలు సైతం కుటుంబ సభ్యులకు అనూహ్యమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ ఖర్చులు భరించటానికి తల తాకట్టుపెట్టాల్సి వస్తోంది. దేశంలో సాలీనా ఆరోగ్య సేవల కోసం రూ.5లక్షల కోట్లు ఖర్చవుతోంది. 60% మందికి పైగా ప్రజలు చికిత్సల కోసం సొంతంగానే డబ్బు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఇంత పెద్దస్థాయిలో ప్రజలు ఎక్కడా ఆరోగ్య సేవల కోసం ఖర్చు చేయడంలేదు. ఈ పరిస్థితి నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్రం ఆరోగ్య భద్రత పథకాన్ని తీసుకొస్తోందని నీతిఆయోగ్ సభ్యుడు వినోద్‌పాల్, సీఈఓ అమితాబ్‌కాంత్ వెల్లడించారు. ఈ పథకం భారత ఆరోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తొలి దశలో 50 కోట్ల మందితో ప్రారంభించి అంతిమంగా 130 కోట్ల మందికి దీన్ని విస్తరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

రాష్ట్రాలతో సంప్రదించాక డేటా ఖరారు
‘ఆయుష్మాన్ భారత్'ను తొలి దశలో దేశంలోని పది కోట్ల నిరుపేద కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి వర్తింపజేస్తారు. అర్హుల ఎంపికకు 2011 నాటి సామాజిక ఆర్థిక కుల జనాభా గణన (ఎస్‌ఈసీసీ) ఆధారం. ఈ గణనలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి వివరాలు పక్కగా ఉన్నాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ ఎస్‌ఈసీసీ లెక్కలతో విభేదిస్తున్నందున అలాంటి రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరిపి ఒక ప్రామాణిక డేటాను ఖరారు చేస్తుంది. దాని ఆధారంగా పథకాన్ని అమలుచేస్తారు. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల వార్షిక వైద్య ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబ సభ్యుల గరిష్ఠ సంఖ్యపై పరిమితి లేదు. ఎంతమంది అయినా ఉండొచ్చు. కుటుంబం మొత్తానికి రూ.5 లక్షలయినా, లేదంటే ఒకే వ్యక్తికి రూ.5 లక్షలయినా ఉపయోగించుకోవచ్చు.

అర్హులు ఏ రాష్ట్రంలో ఉన్నా సేవలు పొందవచ్చా!
ఈ పథకం కింద లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఆ మొత్తాన్ని సమకూరుస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఈ వాటా 90:10 నిష్పత్తిలో ఉంటుంది. పూర్తి నగదు రహిత సేవలు అందిస్తారు. ఇందులో చేరడానికి దరఖాస్తులేమీ భర్తీచేయాల్సిన అవసరంలేదు. ఎస్‌ఈసీసీ డేటాలో పేరున్న పేదలంతా ఆధార్ సంఖ్య ద్వారా వేలిముద్రవేసి పథకంలో చేరవచ్చు. ఇదిలా ఉంటే ఆరోగ్య పథకంలో పేరు నమోదుచేసుకున్న లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఉచిత వైద్యసేవలు పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణలో, తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్‌లో లేదంటే సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడుల్లో ఎక్కడైనా పథకం పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు పొందొచ్చు. మొబైల్ ఫోన్లకు నెంబర్ పోర్టబిలిటీ ఉన్నట్లే ఈ సేవలకు రాష్ట్ర పోర్టబిలిటీ ఉంటుంది. ఒక రాష్ట్రంలో చిరునామా ఉన్న వ్యక్తి పనిమీద దేశంలో ఏదైనా ప్రాంతానికి వెళ్లి అనారోగ్యానికి గురయితే అక్కడే వైద్యసేవలు పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. అందుకయ్యే ఖర్చును అతని సొంత రాష్ట్రం చెల్లిస్తుంది. ఈ పథకంతో ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నా దాన్ని తప్పనిసరి చేయడంలేదు.

మోదీ కేర్.. ఒబామా కేర్ మధ్య తేడాలివి
ఇదో కేంద్ర ప్రాయోజిత పథకం. అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ పథకాన్ని బీమా కంపెనీ ద్వారాకానీ, ట్రస్ట్ విధానంలోకానీ అమలుచేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. తెలుగురాష్ట్రాల్లో ఈ తరహా పథకాన్ని ట్రస్ట్ ద్వారా అమలుచేస్తున్నారు కనుక దాన్ని అలాగే కొనసాగించవచ్చు. దేశంలోని కొన్నిరాష్ట్రాలు రూ.2 లక్షలు, మరికొన్ని రూ.3 లక్షల వరకు బీమా కల్పిస్తున్నాయి. రూ.5లక్షల ప్రయోజనం కల్పించడం దేశంలో ఇదే తొలిసారి. జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించిన తర్వాత దూరదర్శన్‌లో చర్చలో ఆర్థిక మంత్రి జైట్లీ దాన్ని ‘మోదీ కేర్' అని ప్రస్తావించడంతో ఆ పేరుతోనే ఈ పథకాన్ని పిలుస్తారని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ కేర్, ఒబామా కేర్ మధ్య సామీప్యతపై సోషల్ మీడియాలో చర్చ సాగుతున్నది. దీనిపై ఇంకా స్పష్టత రాకపోయినా జైట్లీ ప్రకటనను బట్టి మోదీ కేర్, ఒబామా కేర్ మధ్య తేడాలు కనిపిస్తున్నాయి. ఒబామా కేర్ పథకంలో సంపన్నులకు కూడా పథకం అమలు చేశారు. భారతదేశంలో కేవలం 40 శాతం మందికే ప్రస్తుతం అమలు చేయ సంకల్పించారు. ఒబామా కేర్ ద్వారా 10 రకాల ఆరోగ్య సేవల్ని ప్రజలు పొందొచ్చు. రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లొచ్చు. మందులు ఉచితంగానూ పొందొచ్చు. మానసిక సమస్యలకు పూర్తిస్థాయి చికిత్స పొందవచ్చు.












Click it and Unblock the Notifications