సామాన్యుల దృష్టిని ఆకర్షిస్తున్న స్టాలిన్ ; ఆరో తరగతి విద్యార్థినికి ఫోన్ చేసిన తమిళనాడు సీఎం .. ఎందుకంటే !!
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందరి దృష్టిని ఆకర్షించేలా రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా ఆరో తరగతి విద్యార్థినికి ఫోన్ చేసి మాట్లాడి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలను ఎప్పుడు తెరుస్తారని విద్యార్థులు ఎదురు చూస్తున్న సమయంలో, పాఠశాలల పునః ప్రారంభం పై తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఒక లేఖ రాశారు. విపరీతమైన బిజీ షెడ్యూల్లో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ విద్యార్థిని రాసిన లేఖకు స్పందించారు.

స్కూల్స్ రీ ఓపెన్ పై సీఎం స్టాలిన్ కు లేఖ రాసినఆరో తరగతి విద్యార్థిని
హోసూరు లోని టైటాన్ టౌన్షిప్ కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞ పాఠశాలల పునః ప్రారంభం గురించి వ్రాసిన లేఖలో తన ఫోన్ నెంబర్ కూడా పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ ద్వారా ఆమెతో సంభాషించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు నవంబర్‌లో తిరిగి తెరవబోతున్నామని విద్యార్థిని ప్రజ్ఞకు హామీ ఇచ్చారు. నవంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలకు తిరిగి వెళ్లొచ్చు అంటూ స్టాలిన్ ఆ విద్యార్థినికి తెలిపారు. సీఎం నుంచి ఫోన్ వచ్చిందని గుర్తించిన విద్యార్థి, ఆమె కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

విద్యార్థినికి ఫోన్ చేసి సంభాషించిన స్టాలిన్
విద్యార్థినితో ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన సంక్షిప్త సంభాషణలో, స్టాలిన్, నవంబర్ 1వ తేదీ నుండి పాఠశాలల పునః ప్రారంభం అవుతుంది, చింతించకండి అని పేర్కొన్నారు. కోవిడ్-19 భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడంపై మీ టీచర్ సూచనలను పాటించండి. మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. అలాగే బాగా చదువుకోవాలని విద్యార్థినికి సూచించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆమెతో మాట్లాడుతున్నారని ప్రజ్ఞ నమ్మలేకపోయానని పేర్కొంది. పాఠశాల ఎప్పుడు తిరిగి తెరవబడుతుందో తాను తెలుసుకోవాలనుకున్నానని కాబట్టి, తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పిన ప్రజ్ఞ ఏకంగా సీఎం ఫోన్ చేస్తారని తాను ఊహించలేదని చెప్పారు.

కరోనా సడలింపులలో భాగంగా స్కూల్స్ ఇప్పుడిప్పుడే పునః ప్రారంభం
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు పాఠశాలలు మూసివేసిన తరువాత గత నెలలో తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు రెగ్యులర్ తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే మిగతా వారికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో తమకు కూడా భౌతిక తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకోవాలని భావించిన విద్యార్థినికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సామాన్య ప్రజల కోసం స్టాలిన్ సంచలన నిర్ణయాలు
పరిపాలనలో తనదైన శైలిలో స్టాలిన్, సామాన్య ప్రజలకు సైతం చేరువగా ఉంటూ అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన వల్ల రోడ్లపై ప్రజలకు ఇబ్బంది కలగకూడదని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తన కాన్వాయ్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తగ్గించారు సీఎం స్టాలిన్. అంతేకాదు ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు ప్రయాణం చేసే రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల వాహనాలతో కలిసి ఆయన కొనసాగే విధంగా కేవలం ఆరు వాహనాలు మాత్రమే తన కాన్వాయ్ లో ఉండాలని సీఎం సూచించారు. సీఎం కాన్వాయ్ వస్తుందంటే ఆ దారులలో వాహనాలను నిలిపి వేయడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ఆ విధంగా ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది.