పద్యాలు చెప్పండి.. ఉచితంగా పెట్రోల్ పొందండి: ఆఫర్ ఏప్రిల్ 30 వరకే!
చెన్నై: గత కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా పద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అయితే, ఇప్పుడు అది ప్రాథమిక విద్య స్థాయిలోనే ఆగిపోయింది. ఎవరో కొందరు మాత్రం సాహిత్యంపై మక్కువతో పద్యాలు నేర్చుకుంటున్నారు. మరికొందరు మాత్రమే ఈ రంగంలో ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు. కాగా, తమిళనాడు ప్రజలకు తమ మాతృ భాష అంటే ఎంతో అభిమానమాన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులో ఓ పెట్రోల్ పంపు యజమాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పద్యాలు చెబితే పెట్రోల్ ఉచితంటూ ప్రకటించారు.
ఏపీలో కొత్తగా 50 లోపే కొత్త కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్నంటే? ఆ 4 జిల్లాల్లో కేసుల్లేవ్

కొత్త తరానికి పద్యాలు పరిచయం
పద్యాలకు కొత్త తరాన్ని దగ్గర చేయడానికి సెంగుట్టవన్ వనే ఈ పెట్రోల్ పంపు యజమాని ఈ మేరకు ప్రకటించారు. వళ్వువర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సాహిత్యమంటే ప్రాణం. తమిళుల ఆరాధ్యుడు తిరువళ్లువర్ రచించిన తిరుక్కరల్ గ్రంథంలోని పద్యాలను చెప్పిన వారికి ఉచిత పెట్రోల్ ఆఫర్ అందిస్తున్నారు.

తిరువళ్లువరు రచించిన తిరుక్కరళ్ పద్యాలే..
ప్రముఖ కవి తిరువళ్లువర్ రచించిన ‘తిరుక్కరల్'కు తమిళ సాహిత్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజకీయం, ఆర్థికం, నైతికత, ప్రేమ వంటి అనేక మానవ జీవన పారశ్వాలపై 1330 పద్యాలు ఈ తిరుక్కరల్ గ్రంథంలో ఉన్నాయి. జీవితంలో ఎంతగానో ఉపయోగపడే ఈ పద్యాలు నేర్చుకోవడానికి కూడా సులువుగానే ఉంటాయి.
తిరువళ్లువర్‌ను ఆరాధ్యుడి భావించే సెంగుట్టవన్ కుటుంబంలో అందరికీ కూడా తిరుక్కరల్ పద్యాల కంఠస్థం కావడం గమనార్హం.

పద్యాలు చెప్పండి.. ఫ్రీగా పెట్రోల్ పొందండి..
ఈ క్రమంలోనే కరూర్‌కు సమీపంలోని నాగంపల్లి ప్రాంతంలో ఉన్న తన పెట్రోల్ బంక్ కు కూడా సెంగుట్టవన్.. వళ్లువర్ అనే పేరు పెట్టుకోవడం గమనార్హం. పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమయంలో పద్యాలు చెబితే ఉచితంగా పెట్రోల్ అంటూ సెంగుట్టవన్ ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే తిరుక్కరల్ లో ఉన్న పద్యాల్లో కనీసం 20 చెబితే లీటర్ పెట్రోల్, 10 చెబితే అర లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు సింగుట్టవన్.

ఏప్రిల్ 30 వరకే ఆఫర్.. పెట్రోల్ పంప్ యజమాని ఆనందం
ఈ ప్రకటన ఆ నోట ఈ నోటి పడి నగరమంతా వ్యాపించింది. దీంతో ఆ ప్రాంతంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు తిరుక్కరళ్ పద్యాలను నేర్పిస్తున్నారు. ఇలా తమ పిల్లలతో పద్యాలు చెప్పించి.. ఉచితంగా పెట్రోల్ అందుకుంటున్నారు. కాగా, ఆ తల్లిదండ్రుల కంటే కూడా సెంగుట్టవన్ ఆనందం ఎక్కువగా ఉండటం విశేషం. తన ఆఫర్ కారణంగా అనేక మంది విద్యార్థులు తిరుక్కరళ్ పద్యాలు నేర్చుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఉచిత పెట్రోల్ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సెంగుట్టవన్ స్పష్టంచేశారు. అప్పటి వరకు వందలాది మంది పిల్లలు పద్యాలు నేర్చుకునే అవకాశం లేకపోలేదు. తమిళ సాహిత్యం పట్ల సెంగుట్టవన్‌కు ఉన్న అభిమానానికి పలువురు ప్రశంసిస్తున్నారు.