పవన్ కళ్యాణ్‌పై పోటీ చేయడానికి సిద్ధం: అలీ సంచలన ప్రకటన
చిత్తూరు: ప్రముఖ హాస్య నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేయడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ అధి నాయకత్వం ఆదేశిస్తే- పవన్ కల్యాణ్ పై తాను పోటీ చేస్తానని అలీ వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తాను అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

నగరిలో..
చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు అలీ. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి మెజారిటీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కవని అలీ జోస్యం చెప్పారు. 175 స్థానాలకు 175 స్థానాలను తాము గెలుస్తామని అన్నారు.

పార్టీ ఆదేశిస్తే..
పవన్ కల్యాణ్ ఓ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా ప్రవర్తించట్లేదని అలీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనపై తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పార్టీ ఆదేశిస్తే- ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను పవన్ కల్యాణ్ పై నిల్చుంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంటుందని చెప్పారు.

జగన్ పథకాలే..
వైఎస్ జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయని, అవే తమను గెలిపిస్తాయని అన్నారు అలీ. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంలల్లో ఓడిన ఆయన రోజాను విమర్శించడంలో అర్థం లేదని అన్నారు. డైమండ్ అనేది చాలా పవర్ పుల్ అని, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా అలాంటి డైమండ్ అని అలీ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించిన యువ శక్తి సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

రోజాను విమర్శించడం..
ఓ మహిళా ఎమ్మెల్యేను, అందులోనూ అత్యంత ప్రజాదరణ, గుర్తింపును తెచ్చుకున్న మంత్రిని డైమండ్ రాణిగా అభివర్ణించడం పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రోజా అత్యంత శక్తిమంతమైన డైమండ్ మాత్రమే కాదని.. ఫైర్ బ్రాండ్.. అని అలీ చెప్పారు. రాజకీయాల్లో రోజా కూడా తగ్గేదేలేదని తేల్చి చెప్పారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు అని, ఈ రెండింటినీ ముడిపెట్టి చూడలేమని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications