కుప్పం పర్యటనకు చంద్రబాబు: రెండురోజులు మకాం: తేదీలు ఫిక్స్: పోగొట్టుకున్న చోటే
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించబోతోన్నారు. వచ్చేనెల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ముందస్తు వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల దారుణ పరాజయం అనంతరం.. ఆయన ఈ పర్యటన చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించకుంది. పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్రయత్నం చేస్తోన్నారాయన.

25, 26 తేదీల్లో
ఈ నెల 25వ తేదీన గురువారం ఆయన కుప్పానికి బయలుదేరి వెళ్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకా వేస్తారని అంటున్నారు. కుప్పానికి చెందిన స్థానిక నాయకులు, చిత్తూరు జిల్లా నేతలో ఆయన వరుస భేటీలను నిర్వహిస్తారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పులిపర్తి నాని, మాజీ ఎమ్మెల్యే జీ శంకర్ ఇతర నాయకులతో ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాలు, పార్టీ స్థితిగతుల గురించి ఆరా తీస్తారని సమాచారం.

మున్సిపల్ ఎన్నికలపై..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కుప్పం స్థాయి పెరిగింది. ఇదివరకు మేజర్ పంచాయతీగా ఉన్న ఆ పట్టణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మున్సిపల్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ఓటర్లపై ఉండొచ్చని టీడీపీ నాయకులు అంచనా వేస్తోన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి శ్రమించక తప్పదనే అభిప్రాయం టీడీపీ జిల్లా నేతల్లో వ్యక్తమౌతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం.. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చంద్రబాబు దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కుప్పం నుంచే పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఆయన ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

సొంత జిల్లాల్లో పట్టు
చిత్తూరు జిల్లాలో మొత్తం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, అయిదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు వచ్చేనెల 10వ తేదీన పోలింగ్ ఉంటుంది. 14న ఓట్ల లెక్కింపును చేపడతారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఈ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని టీడీపీ భావిస్తోంది. మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సొంత జిల్లాపై పట్టు సడలిపోలేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో పడింది టీడీపీ.

పార్టీ గుర్తులపై..
పంచాయతీ ఎన్నికలకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. పార్టీ ఎన్నికల గుర్తుల ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకుంటారు ఓటర్లు. ఫలితంగా- తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం.. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. విజయవాడ వంటి చోట టీడీపీ నేతలు ఇప్పటికే ప్రచారం చేపట్టారు. స్థానిక ఎంపీ కేశినేని నాని.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటి ప్రచారానికి చంద్రబాబు కుప్పం నుంచే శ్రీకారం చుడతారని సమాచారం.