కుప్పంలో జూనియర్ పాగా- కాబోయే సీఎం
చిత్తూరు: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో క్రమంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సరికొత్త ఇబ్బందులు తలెత్తే పరిణామాలు నెలకొంటోన్నాయి.
ఈ నియోజకవర్గ ఓటర్లల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి పట్టు ఉండటం.. చంద్రబాబును కలవరపాటుకు గురి చేస్తోందనే విషయం తెలిసిందే. ఆయన కుప్పంలో పర్యటించిన ప్రతీసారీ.. అభిమానులు పెద్ద ఎత్తున జూనియర్ ఫొటోలు, ఫ్లెక్సీలు, ప్లకార్డులను ప్రదర్శిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలనే డిమాండ్‌ను వినిపిస్తూనే వస్తుంటారు.

ఈ పరిణామాల మధ్య యంగ్ టైగర్ ఫ్యాన్స్.. మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆడి కృతిక పండగ సందర్భంగా జూనియర్ భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించిన తీరు.. వారి అభిమానానికి అద్దం పట్టింది. కుప్పం నియోజకవర్గం పరిధిలోని జరుగు పంచాయతీ, పలార్లపల్లి గ్రామంలో వంద అడుగుల ఎత్తు ఉన్న క్రేన్ హుక్‌కు వేలాడుతూ ఇద్దరు అభిమానులు ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించారు.
తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది కుప్పం నియోజకవర్గం. ఈ రెండు రాష్ట్రాల సంప్రదాయాలు, పండగలను అనుసరిస్తుంటారిక్కడి ప్రజలు. తమిళనాడులో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే ఆడికృతిక వేడుకలను కుప్పంలో జరుపుకొన్నారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తూ కావడీలు మోశారు.

వీపులోకి ఇనుప హుక్స్‌ను గుచ్చుకుని వాటికి వేలాడుతూ సుబ్రహ్మణ్య స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అభిమానులు వంద అడుగుల ఎత్తు ఉన్న క్రేన్‌కు వేలాడుతూ జూనియర్ ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. జూనియర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. కాబోయే సీఎం అంటూ నినదించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications