చిత్తూరులో నడిరోడ్డుపై కాలి బూడదైన కారు... అకస్మాత్తుగా మంటలు...
చిత్తూరులో జిల్లాలో ఓ కారు మంటల్లో కాలి బూడిదైంది. మంటలు చెలరేగడం,నిమిషాల్లోనే కారు దగ్ధమవడం జరిగిపోయింది. కారు కొనుగోలు చేశానన్న సంబరం కొద్దిసేపైనా నిలవకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే... చిత్తూరులోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న రాజేష్ బుధవారం(అగస్టు 5) ఓ సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. అనంతరం కాణిపాకంలో పూజ చేయించేందుకు వెళ్తుండగా... ఆరో నంబర్ జాతీయ రహదారిపై రెడ్డిపల్లి సమీపంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి.

అయితే అప్రమత్తంగా వ్యవహరించిన రాజేష్... మంటలు అంటుకున్న క్షణాల వ్యవధిలోనే కారు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే కష్టపడి కొనుక్కున్న కారు... కొన్ని గంటలు కూడా గడవకముందే మంటలకు ఆహుతవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడు రోజుల క్రితం ప్రత్తిపాడు-గుంటూరు రహదారిలోనూ ఇలాగే ఓ కారు దగ్ధమైపోయింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి కారులో వెళ్తుండగా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. అయితే నాగేశ్వరరావు త్వరగా కారు నుంచి బయటపడటంతో ప్రాణాలు కాపాడుకున్నారు. గుంటూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.












Click it and Unblock the Notifications