కన్నకూతురినే కడతేర్చారు: దళితుడిని వివాహమాడిందని: చిత్తూరు జిల్లాలో పరువు హత్య..!
మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఉదంతం తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో ఇదే విధంగా దళితుడిని ప్రేమించిం..వివాహం చేసుకుందనే కారణంతో..తగ్గని ఆగ్రహంతో..ఏడురోజుల బాలింతను కుటుంబ సభ్యులంతా కలిసి పాశవికంగా హత్య చేసారు. మృతదేహాన్ని బావిలో పడేసారు. కన్నతల్లి సైతం ఈ ఘాతుకంలో పాల్గొనటం సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేసింది.
కన్నతల్లే కూతురి హత్యలో ఇలా..
కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో..కన్న తల్లే కుటుంబ సభ్యులతో కలిసి కడుపున పుట్టిన కుమార్తెను కడ తేర్చిన అమానవీయ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. జిల్లాలోని పలమనేరు మండలంలోని అటవీ గ్రామమైన ఊసరపెంట గ్రామంలో భాస్కర్ నాయుడు..వరలక్ష్మిల కుమార్తె హేమావతి. కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు కేశవ్‌ను ప్రేమించింది. కేశవ్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వారిద్దరి వివాహానికి హేమావతి తల్లితండ్రులు అంగీకరించలేదు. దీంతో వారు ఇంటి నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో.. తమ కుమార్తె పైన తల్లి తంద్రులు కక్ష్య పెంచుకున్నారు. పలుమార్లు వారిద్దరిని బెదిరించటంతో పాటుగా దాడులు చేసారు. పోలీసుల జోక్యంతో కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు. దీంతో..హేమవతి- కేశవ్ బెంగుళూరు వెళ్లిపోయి జీవనం సాగిస్తున్నారు.

బాలింత అనే కనికరం లేకుండా..
గర్బవతిగా ఉన్న హేమవతి తన భర్త సోదరికి ఇంటికి బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి వచ్చింది. గత వారం మగ బిడ్డ కు జన్మ ఇచ్చింది. ఆ తరువాత ఆస్పత్రి నుండి తన అత్త వారింటికి వెళ్లింది. బిడ్డకు స్వల్ప అస్వస్థతతో తల్లి తం డ్రులు బిడ్డను ఆస్పత్రిలో చూపించి తిరిగి వెళ్తుండగా..హేమవతి తల్లి తండ్రులు..సోదరుడు వారిని అడ్డుకున్నారు.
హేమవతి భర్త బంధువుల పైన దాడి చేసి ఆమెను బండి మీద ఎక్కించుకొని వెళ్లిపోయారు. దీంతో..అప్రమత్తమైన కేశవ్ వారిని వెంబడిస్తూనే..బంధవులకు సమాచారం ఇచ్చారు. పసిబిడ్డ అతని చేతిలోనే ఉన్నాడు. అప్పటికే అడ్డదారుల్లో పొలాల్లోకి వెళ్లిపోయిన వీరు కనిపించలేదు. మామిడితోటల్లోకి ఈడ్చుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశారు. అనంతరం ఆమెను కాళ్లు, చేతులు కట్టేసి లాక్కొస్తున్న దృశ్యం చూసిన కొందరు బిగ్గరగా కేకలు వేయటంతో, మృత దేహాన్ని సమీపంలోని బావిలో పడేసి పరారయ్యారు. పోలీసులు మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించారు. హేమవతి అప్పటికే విగత జీవిగా మారిపోయింది. దీంతో..ఒక్క సారిగా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ హత్యలో తల్లి తండ్రులే పాల్గొనటం మానవ సంబంధాలకు మచ్చగా మారింది.












Click it and Unblock the Notifications