చిత్తూరు జిల్లాలో విషాదాంతం అయిన బాలుడి కిడ్నాప్ కథ; బొప్పాయి తోటలో శవంగా .. మిస్టరీ డెత్ !!
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం చిత్తూరు జిల్లాలో కనిపించకుండా పోయిన 8 సంవత్సరాల బాలుడు తేజస్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఎగువ మేకల వారి పల్లిలో తేజస్ రెడ్డి అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిన్న అదృశ్యమైన బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు వెతుకుతున్న క్రమంలో ఈరోజు బాలుడి మృతదేహం ఓ చెరుకుతోటలో లభ్యమైంది.
బాలుడు తల్లిదండ్రులు నాగిరెడ్డి ,జ్యోతి ఉపాధి కోసం కువైట్ కి వెళ్లారు. అప్పటి నుండి బాలుడు పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్కూల్ కి వెళుతున్నాడు. దసరా పండుగ సెలవులు కావడంతో బాలుడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ బయట బాలుడు ఆడుకుంటున్న క్రమంలో అదృశ్యమయ్యాడు. చుట్టుపక్కల వెతికినా బాలుడు కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన బంధువులు, బాలుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆచూకి కోసం వెతుకుతున్న క్రమంలో ఈరోజు బొప్పాయి తోటలో బాలుడి మృతదేహం కనిపించింది.

బాలుడిని గొంతు నులిమి చంపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దగ్గరి బంధువులే బాలుడిని హతమార్చి ఉంటారని భావిస్తున్న క్రమంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు ఇక్కడ ఉండడం లేదని, ఈ సమయంలో బాలుడిపై ఈ దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఎక్కడ, ఎవరికి ఉందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అన్న క్రమంలోనూ విచారణ జరుపుతున్నారు. అంతేకాదు కుటుంబ తగాదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. బాలుడి హత్య కేసులో బాలుడిని తీసుకెళ్లిన వాళ్లు ఎవరు? ఎందుకు హతమార్చారు? అన్న విషయాలు మిస్టరీగా మారగా ఈ మిస్టరీని పోలీసులు ఛేదించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications