ప్రమాదకర స్థాయికి రాయలచెరువు నీటిమట్టం: భయంతో గ్రామాలు ఖాళీ చేస్తున్న ప్రజలు
చిత్తూరు: గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు జిల్లాలోని రాయల చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రాయలచెరువు వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు చెరువు ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆరు రోజుల కిందట చెరువు నిండినప్పుడే స్పందించి వుంటే వేలాదిమంది ఇళ్ళు వదలి వెళ్ళే పరిస్థితి వుండేది కాదంటున్నారు.

రాయల చెరువుకు లీకేజీలు..
కాగా, 15వ శతాబ్దం నాటి రాయల చెరువు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. లీకేజీలు కూడా కనిపించాయి. ఓ చోట గండిని అధికార యంత్రాంగం తాత్కాలికంగా పూడ్చివేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు. ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.

చెరువుకు గండి భయంతో ఇతర ప్రాంతాలకు ప్రజలు
రాయలచెరువుకు గండి పడుతుందనే భయంతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఆదివారం రాత్రి కూడా అనేకమంది ప్రజలు తమ సామాగ్రిని మోసుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రాణాలను కాపాడుకునేందుకు తమకు ఇంతకంటే వేరే దారిలేదని అంటున్నారు.

ఇంకా ముంపులోనే అనేక గ్రామాలు, పట్టణాలు
కాగా, చిత్తూరు జిల్లాలోని తిరుపతితోపాటు అనేక గ్రామాలు, పట్టణాలు ఇంకా ముంపులోనే మగ్గుతున్నాయి. వందలాది గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా వరదనీరే కనిపిస్తోంది. నదులు, వాగులు, వంకలు మహోగ్రరూపం దాల్చాయి. ఎంఆర్‌పల్లి, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్, సరస్వతినగర్, గాయత్రినగర్, వాసవీనగర్ ప్రాంతాలు ముంపులోనే మగ్గుతున్నాయి. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీరు లేక జనం అల్లాడిపోతున్నారు.

భారీ వర్షంతో జల దిగ్బంధంలోనే ప్రజలు
తిరుమలలోనూ ఇదే పరిస్థితి ఉంది. జల విధ్వంసానికి తిరుమల మెట్ల మార్గం, ఘాట్ రోడ్లు కొట్టుకుపోయాయి. ఘాట్ రోడ్స్, మెట్ల మార్గాల్లో పేరుకుపోయిన బురద, బండరాళ్లను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు, కర్నూలు జిల్లాలో ప్రవహిస్తున్న తుంగభద్రా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో తుంగభద్రానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండటంతో పాటు నదిలోకి ఎవరు దిగ రాదని హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత నవంబర్ నెలలో పూర్తి స్థాయిలో డ్యాం 30 గేట్లు ఎత్తి నదికి విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. డ్యాంకు దిగువన ఉన్న సుంకేసుల రిజర్వాయర్ కూడా నిండి 15 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నది కి విడుదల చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరంతా శ్రీశైలంలో కలవనుంది. తుంగభద్రడ్యాం మరోసారి నిండటంతో కర్నూలు కడప అనంతపురం జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాలకు రబి సీజన్లో కూడా సాగునీటికి ధోకా లేనట్లేనని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వేసిన పంట మాత్రం తీవ్రంగా దెబబ్తిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విషాదం మిగిల్చిన భారీ వర్షాలు, వరదలు
చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మూగజీవాలు వరదలో విగతజీవులుగా మారాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. రైతుల పంటలకు కూడా భారీ నష్టం జరిగింది. కడప జిల్లాలోనూ భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని పల్లెలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ఉధృతితో ఈ నది పరివాహక పరిధిలోని రాజంపేట, పులపత్తూరు, మందపల్లి శివాలయం ఘటన, బస్సు ప్రమాదం వేర్వేరు ఘటనల్లో30 మంది గల్లంతు కాగా.. ఆదివారం రాత్రి వరకు 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.












Click it and Unblock the Notifications